
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వలసపోయాడు.. కుటుంబం కోసం నరకం అనుభవించాడు. చివరికి సంకెళ్లు తెంచుకున్న పక్షిలా.. ఎంతో సంతోషంగా స్వగ్రామానికి బయలుదేరాడు. మరి కొన్ని గంటల్లో ఇంటికి చేరుకునే వారు. అంతలోనే విమానంలో అస్వస్థతతో కుప్పకూలిపోయాడు. దీంతో అత్యవసరంగా విమానం ల్యాండ్ చేశారు. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేశారు. కానీ.. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంత ప్రయత్నించినా అతన్ని కాపాడలేకపోయారు. దీంతో ఆ కుటంబంలో తీవ్ర విషాదం నెలకొంది..
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీరాముల శ్రీధర్.. కొన్ని రోజులుగా సౌదీలో పని చేసుకుంటూ బతుకుతున్నాడు. అప్పుసొప్పు చేసి నాలుగు రూపాయలు కూడబెట్టుకోవచ్చని గంపెడాశతో గల్ఫ్ కు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది. ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళకు.. విషయం చెప్పగా హుటాహుటిన ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు.
ఎయిర్‌పోర్ట్ సిబ్బంది శ్రీధర్‌కు సీపీఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా శ్రీధర్ బతకలేదు. దీంతో ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయి అనాథగా మారింది. శ్రీధర్ కు భార్య.. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.. కొన్ని రోజుల పాటు కుటుంబ సభ్యులతో హాయిగా గడుపాలని అనుకున్నాడు. కానీ.. విధి వక్రించి.. గుండె పోటుతో తుది శ్వాస విడిచాడు శ్రీధర్. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం ఏదో రకంగా సాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..