
ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు కూడా షుగర్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ క్రమంలోనే చాలా మందికి వచ్చే సందేహం.. స్వీట్ కార్న్ తినవచ్చా? నిజానికి చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే ఈ స్నాక్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇది తింటే షుగర్ పేషెంట్లకు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందా..? అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తుంటుంది. స్వీట్ కార్న్‌లోని పోషక విలువలు, అది డయాబెటిస్‌పై చూపే ప్రభావాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్‌పై స్వీట్ కార్న్ ప్రభావం
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ : స్వీట్ కార్న్ GI స్కోరు 52-55 మధ్య ఉంటుంది. ఇది తక్కువ నుండి మితమైన కేటగిరీ కిందకు వస్తుంది. అంటే ఇతర పిండి పదార్థాల ఆహారాలతో పోలిస్తే, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఒక్కసారిగా పెంచదు.
డైటరీ ఫైబర్: ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది. ఫలితంగా చక్కెర శోషణ నిదానంగా జరిగి ఇన్సులిన్ స్పైక్స్ రాకుండా ఉంటాయి.
అద్భుతమైన యాంటీఆక్సిడెంట్స్: ఇందులో ఉండే లుటీన్, జియాక్సంతిన్ కంటి చూపును మెరుగుపరుస్తాయి. మధుమేహం వల్ల వచ్చే కంటి సమస్యల నుంచి రక్షణ కల్పిస్తాయి.
ముఖ్యమైన పోషకాలు: విటమిన్ A, B, C లతో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు గుండె ఆరోగ్యానికి, ఇన్సులిన్ సెన్సిటివిటీకి తోడ్పడతాయి.
ప్రతికూల అంశాలు
అధిక కార్బోహైడ్రేట్లు: స్వీట్ కార్న్‌లో పిండి పదార్థాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మోతాదు మించితే రక్తంలో చక్కెర పెరగడం ఖాయం.
ప్రాసెస్ చేసిన ఉత్పత్తులు: డబ్బాలో నిల్వ చేసిన లేదా స్వీటెనర్లు కలిపిన స్వీట్ కార్న్ ఉత్పత్తులు మధుమేహులకు అత్యంత ప్రమాదకరం. వీటిలో సోడియం, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
షుగర్ ఉన్నవారు స్వీట్ కార్న్ ఎలా తినాలి?
మోతాదు ముఖ్యం: రోజువారీ ఆహారంలో ఒక చిన్న కప్పు తీసుకోవడం సురక్షితం.
ఉడికించడం ఉత్తమం: నూనెలో వేయించడం కంటే ఉడికించిన లేదా కాల్చిన మొక్కజొన్న ఆరోగ్యకరం.
కాంబినేషన్: స్వీట్ కార్న్ తినేటప్పుడు దాంతో పాటు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారంలేదా పీచు పదార్థం ఉన్న కూరగాయలు తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది.