
చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతూ రక్తనాళాల్లో అడ్డుపడి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. దీన్ని తొందరగా గుర్తించకపోతే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. కానీ కొలెస్ట్రాల్ పెరిగిన మొదట్లోనే కొన్ని లక్షణాలు కనిపించవచ్చు. వాటిని గుర్తించి డాక్టర్ ను సంప్రదిస్తే సమస్యను అదుపులో ఉంచడం సులభం అవుతుంది.
కళ్ళ చుట్టూ మచ్చలు
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారిలో కళ్ళ చుట్టూ లేదా పై కంటి రెప్పల వద్ద పసుపు రంగు మచ్చలు కనిపించవచ్చు. ఇవి చర్మం కింద పేరుకుపోయిన కొవ్వు వల్ల ఏర్పడతాయి. దీనిని సాన్ థెలాస్మా అని అంటారు. ఈ రకమైన మచ్చలు కనిపించిన వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవాలి.
కళ్ళ వలయాలు
45 ఏళ్లలోపే కళ్ళ చుట్టూ తెలుపు లేదా బూడిద రంగు వలయాలు కనిపిస్తే.. అవి అధిక కొలెస్ట్రాల్ కు సంకేతం కావచ్చు. వీటిని తేలికగా తీసుకోకూడదు. సమయానికి టెస్టులు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
చర్మంపై సాన్ థోమాస్
చర్మం మీద మోకాళ్ళు, మణికట్టు, పాదాలు, నడుము భాగాల్లో పసుపు రంగులో చిన్న పొక్కులు కనిపిస్తే వీటిని సాన్ థోమాస్ అని పిలుస్తారు. ఇవి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలకు సంకేతంగా పరిగణించవచ్చు.
కండరాల్లో గడ్డలు
కొన్నిసార్లు అధిక కొలెస్ట్రాల్ కారణంగా కండరాలపై గడ్డలు లేదా గట్టిదనం ఏర్పడుతుంది. ముఖ్యంగా అకిలెస్ టెండన్ (అరికాలి వెనుక భాగం), చేతులు, మోకాళ్ళ వద్ద ఇవి కనిపించవచ్చు. ఇది ఒక వారసత్వ పరిస్థితి అయిన ఫ్యామిలియల్ హైపర్ కొలెస్టెరోలేమియాకు సంబంధించి ఉండొచ్చు.
అలసట, ఛాతీ బిగుతు, శ్వాస సమస్యలు
రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతే రక్త ప్రసరణ కష్టమవుతుంది. దీని వల్ల అలసట, ఛాతీలో ఒత్తిడి, గట్టిగా శ్వాస తీసుకోవడం లాంటి సమస్యలు కలగవచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి చెయ్యి లేదా దవడ వరకు కూడా వ్యాపించవచ్చు.
పక్షవాతం
మెదడుకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది. శరీరంలో ఒక్కసారిగా బలహీనత, మాట్లాడలేకపోవడం, చూపులో మార్పులు, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ పరిస్థితికి అత్యవసర వైద్య సహాయం అవసరం.
చర్మంలో చలి
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరానికి రక్త ప్రసరణ సరిగా జరగదు. దీని ప్రభావంగా శరీరం చల్లగా అనిపించడం, చర్మాన్ని తాకినప్పుడు సున్నితత్వం కోల్పోవడం. గాయాలు త్వరగా మానకపోవడం లాంటి సమస్యలు వస్తాయి.
ఇతర లక్షణాలు
ఇవి కాకుండా మానసిక స్థితిలో మార్పులు, జ్ఞాపకశక్తి తగ్గడం, కీళ్ల నొప్పులు, పిత్తాశయంలో నొప్పి లాంటి లక్షణాలు కూడా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో కనిపించవచ్చు.
ఈ రకమైన చిన్న చిన్న మార్పులను గమనిస్తూ.. ఆరోగ్యాన్ని అదుపులో ఉంచడమే మంచి జీవనశైలికి మార్గం. ఏదైనా అనుమానాస్పద లక్షణం కనిపించిన వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. ముందు జాగ్రత్తలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)