సేలంలో TVK చీఫ్ విజయ్ నిర్వహించిన సభపై వివాదం రాజుకుంది. సభలో ఓ అభిమాని గుండెపోటుతో చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పరిమితికి మించి సభకు జనాన్ని తరలించారని పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రజావ్యతిరేక DMK ప్రభుత్వాన్ని ఓడించడం, తమకు పట్టం కట్టడం ప్రజల నిజమైన కల అని TVK అధినేత విజయ్ అన్నారు. రాబోయే ఎన్నికలు తనకు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మధ్య ప్రత్యక్ష పోటీ అని తెలిపారు. ఇతరులెవరికీ ఈ పోటీలో స్థానం లేదని వివరించారు. ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిస్తామో తెలియజేసే స్పష్టమైన మ్యానిఫెస్టో రూపొందుతోందని విజయ్ ప్రకటించారు.
సేలంలో భారీ బహిరంగసభ నిర్వహించారు విజయ్. అయితే సభలో ఓ అభిమాని గుండెపోటుతో చనిపోవడంపై వివాదం రాజుకుంది. విజయ్ ర్యాలీకి హాజరైన సూరజ్ అనే అభిమాని గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. సూరజ్ స్వస్థలం మహారాష్ట్ర. ఉపాధి నిమిత్తం అతడు కొన్నేళ్ల క్రితం కుటుంబంతో సహా సేలానికి వచ్చాడు. కొంత కాలంగా అతడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. కరూర్ తొక్కిసలాట వంటి పరిస్థితులు తలెత్తకుండా విజయ్ ర్యాలీల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. సేలంలో అనుమతి తీసుకున్న దానికంటే ఎక్కువమందిని నిర్వాహకులు అనుమతించడం వల్ల వేదిక ప్రాంగణం కిక్కిరిసిపోయిందని తెలిపారు. 5 వేల మందికి మాత్రమే పరిమితి ఉంటే.. దాదాపు 7వేల మందిని తరలించారని చెప్పారు. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామన్నారు.
డీఎంకే అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడుతోందని విజయ్ అన్నారు. వాళ్లు ఇస్తున్న డబ్బులు తీసుకోండి…కానీ విజిల్‌కు అండగా నిలవండి’ అని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు కలైంగర్ పథకం కింద లబ్ధిదారులైన 1.31 కోట్ల మంది మహిళలకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాలకు కలిపి రూ.3,000, సమ్మర్ స్పెషల్‌గా రూ.2,000 వారి ఖాతాల్లో స్టాలిన్ ప్రభుత్వం జమచేసింది.. డీఎంకే ఒక దుష్టశక్తి అని, టీవీకే మంచిచేసే పార్టీ అని అన్నారు. ‘మంచికి ఓటు వేస్తారా? దుష్టశక్తికి ఓటు వస్తారా’ అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
ప్రతి ఇంట్లో, వీధిలో విజిల్ సౌండ్ వినిపిస్తోందని , టీవీకేకు, విజిల్‌కు పెరుగుతున్న మద్దతు, ముఖ్యంగా మహిళల్లో కనబడుతున్న ఆదరణ చూసి స్టాలిన్ బెదిరిపోతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని పాలించే అనుభవం లేదంటూ డీఎంకే చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అవినీతి చేయడంలో డీఎంకేకు ఉన్న అనుభవం తమకు లేదన్నారు. ప్రజలను ఫూల్స్ చేస్తున్న వారు, అధికారంలో ఉన్నవారినే తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు. తాను సుపరిపాలన అందిస్తానని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనని, బూటకపు హామీలు ఇవ్వనని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..