పెరుగుతున్న ధరల కాలంలో రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత అనేది ప్రతి ఒక్కరికీ ముఖ్యం. తమ కష్టార్జితం సురక్షితంగా ఉండటంతో పాటు ప్రతి నెలా స్థిరమైన ఆదాయం రావాలని కోరుకునే వృద్ధులకు పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది. ప్రభుత్వ గ్యారెంటీ ఉండటంతో ఇందులో రిస్క్ సున్నా. ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం 8.2శాతం వడ్డీని అందిస్తోంది. ఇది చాలా బ్యాంకులు ఇచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్ల కంటే కూడా ఎక్కువ. ప్రభుత్వ భద్రత ఉండటం వల్ల సాధారణ ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి వారు ఈ పథకంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.
నెలకు రూ. 17,000 ఆదాయం ఎలా సాధ్యం?
ఈ పథకంలో గరిష్టంగా ఒక వ్యక్తి రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవేళ మీరు ఈ పథకంలో రూ. 25 లక్షలు పెట్టుబడి పెడితే లెక్కలు ఇలా..
- మొత్తం పెట్టుబడి: రూ. 25,00,000
- వడ్డీ రేటు: 8.2శాతం
- 5 ఏళ్లలో వచ్చే మొత్తం వడ్డీ: రూ.10,25,000
- వార్షిక ఆదాయం: రూ. 2,05,000
- నెలవారీ సగటు ఆదాయం: రూ. 17,083
ఇందులో వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ ఖాతాలో జమ చేస్తారు. అంటే ప్రతి మూడు నెలలకు రూ.51,250 పొందే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
పథకం ముఖ్య ఉద్దేశాలు – అర్హతలు:
ఈ పథకాన్ని కేవలం రూ 1,000 తో కూడా ప్రారంభించవచ్చు. సాధారణంగా 60 ఏళ్లు నిండిన వారు అర్హులు. అయితే VRS తీసుకున్న వారు 55-60 ఏళ్ల మధ్య, రిటైర్డ్ రక్షణ సిబ్బంది 50 ఏళ్ల తర్వాత కూడా ఇందులో చేరవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఏడాదికి రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. అవసరమైతే మెచ్యూరిటీ తర్వాత మరో 3 ఏళ్లు పొడిగించుకునే సదుపాయం ఉంది.
ముందస్తు క్లోజింగ్..
ఒకవేళ గడువు తీరకముందే డబ్బు అవసరమైతే నిబంధనల ప్రకారం కొంత జరిమానా చెల్లించి ఖాతాను మూసివేయవచ్చు. దురదృష్టవశాత్తు ఖాతాదారుడు మరణిస్తే, ఆ మొత్తం వడ్డీతో సహా నామినీకి అందజేస్తారు.
రిటైర్మెంట్ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా, గౌరవప్రదమైన జీవనం సాగించాలనుకునే వారికి SCSS ఒక గొప్ప ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది. ఒకసారి పెట్టుబడి పెడితే, మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా స్థిరమైన వడ్డీని పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి