ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా వినయోగించకపోతే మనం ఎదుర్కొనే ప్రమాదాలు కూడా అవే సంఖ్యలో ఉంటాయి. ఇందుకు ఉదాహారణ ఈ మధ్య కాలంలో తరచూ మన ఇంట్లో ఉండే ఏసీ, ప్రిజ్‌ల వంటివి పేలిపోవడం. ఇవే కాదు కొన్ని ప్రాంతాల్లో మనం నిత్యం వినియోగించే మొబైల్ ఫోన్స్ కూడా పేలిపోయిన ఘటనలు చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే మన హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్‌లో వెలుగు చూసింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు బైక్‌మీద వెళుతున్న క్రమంలో తన ప్యాంట్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది చూసిన ఆ యువకుడు అవాక్కయ్యాడు.
పెయింటర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే ఓ యువకుడు ఉదయం తన బండిపై రాజేంద్రనగర్ వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో తన ప్యాంటు జేబులో ఏదో కాలిపోతున్నట్టు అనిపించింది. వెంటనే తన బైక్‌ను పక్కకు ఆపి.. ఏమైందని చూసేవరకే ప్యాంట్ జేబులో నుండి పొగలు వస్తున్నాయి. అతని జేబులో ఉన్న వీవో మొబైల్ ఫోన్‌ను తీసి చూడగా.. అది కాలిపోయి ఉండడం గమనించాడు.
ప్యాంటు జేబులోనే ఫోన్ ఉండటంతో యువకుడి తొడ బాగానికి గాయాలు అయ్యాయి. అది గమనించిన స్థానికులు వెంటనే ఆ యువకుడిని స్థానికంగా ఉన్న హాస్పిటల్‌కి తరలించారు. ఒకవేళ మొబైల్ ఫోన్ పేలి ఉంటే యువకుడి ప్రాణానికే ప్రమాదం ఏర్పడేది. ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్‌ను పెట్టడం ఎట్టి పరిస్తితిలో మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. వాటిని సరిగ్గా వినియోగించకపోతే కొన్ని సందర్భాల్లో అవి పేలే ప్రమాదం ఉందని.. తద్వారా మనిషి ప్రాణానికే అపాయం ఏర్పడే పరిస్థితులు ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.