వర్షాకాలంలో మనం బయట మాత్రమే కాదు.. ఇంట్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే భారీ వర్షాలకు మన ఇల్లు, అందులో ఉండే మనం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. మీకోసం కొన్ని ముఖ్యమైన చిట్కాలను తీసుకొచ్చాను. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఎలక్ట్రిక్ షాక్ నుంచి జాగ్రత్త
వర్షాకాలంలో గోడలు తడిసిపోవడం కామన్. దీనివల్ల గోడల్లో ఉండే కరెంట్ వైర్లు కూడా తడిచిపోతాయి. ఇలాంటప్పుడు షార్ట్ సర్క్యూట్‌లు, ఎలక్ట్రిక్ షాక్‌లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంట్లోని స్విచ్ బోర్డులు, ప్లగ్ పాయింట్లు, వైర్లను బాగా చెక్ చేసుకోండి. ఏ చిన్న డౌట్ వచ్చినా ఎలక్ట్రీషియన్‌ని పిలిచి రిపేర్ చేయించుకోండి.
గోడలపై బూజు, వాసన వస్తే..
వర్షం వల్ల గోడలు, పైకప్పు తడిస్తే బూజు (Fungus) పట్టి, పెయింట్ ఊడిపోతుంది. అలాగే ఇంట్లో ఒక రకమైన తడి వాసన వస్తుంది. దీన్ని ఇగ్నోర్ చేస్తే అది ఆరోగ్యానికి హానికరం. ఈ బూజు వల్ల శ్వాస సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే గోడలపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పెయింటర్‌ని పిలిచి రిపేర్లు చేయించుకోండి. పెద్ద డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్త పడండి.
విండోస్, డోర్స్ జాగ్రత్త
వర్షకాలంలో కిటికీలు సరిగ్గా మూసుకోకపోవడం వల్ల నీరు లోపలికి వస్తుంది. అలాగే కిటికీల చుట్టూ దుమ్ము పేరుకుంటే అది అడ్డుపడి నీరు బయటికి వెళ్లదు. అందుకే కిటికీలను క్లీన్‌గా ఉంచుకోండి. అంతే కాదు ఇంట్లో టైల్స్ పగిలిపోయినా.. పైకప్పులో పగుళ్లు ఉన్నా వెంటనే రిపేర్ చేయించుకోండి. లేకపోతే వర్షపు నీరు లోపలికి వచ్చి ఇల్లంతా డ్యామేజ్ అవుతుంది.
టెర్రస్, బాల్కనీ క్లీనింగ్ మస్ట్
టెర్రస్, బాల్కనీలో వర్షపు నీరు నిలిచిపోతే అది పైకప్పు పగుళ్ల ద్వారా లోపలికి వచ్చి గోడలను తడిపేస్తుంది. దీని వల్ల ఇంటి నిర్మాణం వీక్ అవుతుంది. కాబట్టి టెర్రస్, బాల్కనీలను ఎప్పుడూ క్లీన్‌గా ఉంచుకోండి. నీరు నిలిచిపోకుండా డ్రెయినేజీ పైపులు బాగా పని చేస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి.
ఇంటికి దూరంగా వర్షపు నీరు
వర్షపు నీరు ఇంటి చుట్టూ నిలిచిపోతే అది పునాదుల బలహీనతకు కారణమవుతుంది. అందుకే ఇంటి చుట్టూ వర్షపు నీరు నిలవకుండా చూసుకోండి. డ్రెయినేజీ సిస్టమ్ సరిగ్గా ఉండేలా జాగ్రత్త పడండి. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే.. మీరు వర్షాకాలంలో మీ ఇంటిని, మీ కుటుంబాన్ని సేఫ్‌గా కాపాడుకోవచ్చు.