వర్షాకాలంలో ఆకుకూరలు తినకూడదని ఇంట్లో పెద్దలు తరచూ చెబుతుంటారు. వర్షాకాలంలో ఆకు కూరలు తింటే కడుపు నొప్పి, విరేచనాలు అవుతాయని చెబుతుంటారు. అయితే, ఇవన్నీ అపోహలు మాత్రమే అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఆకు కూరలు తినకూడదని ఎందుకంటారంటే,..
కూరగాయలతో పోలిస్తే ఆకుకూరలు భూమికి దగ్గరగా పెరుగుతాయి. వర్షపు జల్లుల వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ సులభంగా వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా ఆకుకూరలపై మట్టి, కీటకాలు లేదా వాటి గుడ్లు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నింటిని కారణాలుగా పేర్కొంటూ ఆకుకూరలు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు.
వర్షాకాలంలో మన శరీరానికి అవసరమయ్యే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పోలిక్ ఆమ్లాలు ఆకుకూరల నుంచి ఎక్కువ మొత్తంలో లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, రోజువారీ ఆహారంలో 50 గ్రాముల చొప్పున ఏదో ఒక ఆకుకూరని చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
ఆకు కూరలు వండేముందు ఉప్పు లేదా వెనిగర్ కలిపిన నీటితో రెండు లేదా మూడు సార్లు బాగా కడిగి ఎక్కువసేపు ఉడికించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో పచ్చి ఆకుకూరలు తినడం కంటే, వాటిని బాగా ఉడికించి తినడం మంచిదని, ఇలా చేయడం వల్ల అందులో ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయని చెబుతున్నారు.
ఆకులు కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మురికిగా లేదా వాడిపోయిన వాటిని కొనుగోలు చేయకుండా, తాజాగా కనిపించే ఆకుకూరలనే ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. వీలైతే సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆకుకూరలను ఎంచుకోవడం మంచిదని, ఎందుకంటే వాటిపై రసాయన అవశేషాలు తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.