వరలక్ష్మీ వ్రతం.. ఈ వ్రతం కేవలం పెళ్లైన మహిళలకు మాత్రమే కాదు.. వివాహం కాని యువతులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి ఆశీర్వాదం పొందడానికి భక్తి, శ్రద్ధ ఉంటే సరిపోతుంది. ఈ వ్రతం గురించి, వ్రతం ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి కాని అమ్మాయిలు ఈ వ్రతం చేయొచ్చా..?
సంపద, సంతోషం, కుటుంబ శ్రేయస్సు కోసం వారలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. పురాణాల ప్రకారం.. శివుడు ఈ వ్రతం గురించి పార్వతీ దేవికి చెప్పారని.. పార్వతీ దేవి తన కుటుంబం క్షేమం కోసం ఈ పూజ చేసిందని చెబుతారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతం జరుపుకుంటారు.
ఎవరు ఈ వ్రతం చేయొచ్చు..?
చాలా మందికి ఈ వ్రతం పెళ్లైన మహిళలు మాత్రమే చేయాలని ఒక అపోహ ఉంటుంది. కానీ అది నిజం కాదు. పెళ్లి కాని అమ్మాయిలు కూడా తమ తల్లిదండ్రుల ఇంటికి మంచి జరగాలని.. అలాగే మంచి భర్త లభించాలని కోరుకుంటూ ఈ వ్రతం చేయవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెళ్లైన వారికే ఈ వ్రతం పరిమితం అని అనుకున్నా.. అలాంటి నిబంధనలు పెద్దగా లేవు. ఈ పూజలో పురుషులు కూడా పాల్గొనవచ్చు. కానీ ముఖ్యంగా మహిళలు చేస్తారు.
వరలక్ష్మీ వ్రతం పూజా విధానం
పూజ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత దేవుడి గదిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ప్రతిమను అందంగా అలంకరించి కలశం పెడతారు. పూలతో దేవిని పూజించి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. పూజ పూర్తయ్యాక ముత్తయిదువులకు తాంబూలం ఇస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది.
అమ్మవారికి నైవేద్యాలు
ఈ వ్రతంలో అమ్మవారికి ఇష్టమైన వంటకాలు నైవేద్యంగా పెడతారు. సాధారణంగా చక్కెర పొంగలి, పాయసం, కొబ్బరి లడ్డు వంటివి సమర్పిస్తారు. ఈ వంటకాలను ప్రేమతో, భక్తితో ఇంట్లోనే తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు.
లక్ష్మీదేవిని భక్తితో పూజించేవారు ఎవరైనా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ వ్రతం చేయడానికి వయసుతో, పెళ్లితో సంబంధం లేదు. ఈ పండుగను కుటుంబమంతా కలిసి ఆనందంగా జరుపుకోవచ్చు.