వందేళ్లకు పైగా నిలిచేలా ఎంపీలకు నూతన నివాసాలు.. చూస్తేనే కళ్లు జిగేల్..!

వందేళ్లకు పైగా నిలిచేలా ఎంపీలకు నూతన నివాసాలు.. చూస్తేనే కళ్లు జిగేల్..!


దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సభ్యులకు నూతన నివాస సముదాయాలు అందుబాటులోకి రానున్నాయి.18 వ లోక్ సభ, రాజ్యసభకు ఎంపికైన ఎంపీలకు ఢిల్లీలో నివాస గృహాల కేటాయింపు ఇంకా జరగలేదు. ఇప్పటికే ఉన్న గృహాలు పాతవి కావడం సరిపడ గృహాలు లేకపోవడంతో ఎంపీలకు నూతన నివాస సముదాయాలను నిర్మించింది CPWD. ఆగస్టు 11 సోమవారం ఎంపీల నూతన నివాస సముదాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

బాబా ఖరక్ సింగ్ మార్గ్‌లో పార్లమెంటు సభ్యుల కోసం రూ. 680 కోట్లతో ఎంపీలకు 25 అంతస్తుల అపార్ట్‌మెంట్స్ నిర్మాణం జరిగింది. రెండేళ్ల పాటు ఈ అపార్ట్‌మెంట్స్ నిర్మాణం జరిగింది. ఎంపీ కాంప్లెక్స్‌లో ఎంపీలు, వారి కుటుంబాలు సిబ్బందితో సహా దాదాపు 2,468 మంది నివాసం ఉంటారని అంచనా. ఇటీవల నూతనంగా ఎంపికైన ఎంపీలకు నూతన ఎంపీ ప్లాట్స్ కేటాయించనున్నారు. ప్రధాని నేరుగా ఫ్లాట్ తాళాలను ఎంపీలకు అందజేయనున్నారు.. మొత్తం ఐదు టవర్ల నిర్మాణం జరగ్గా నాలుగు నివాస టవర్లలో 184 ఫ్లాట్‌లు ఉన్నాయి. మరో టవర్ వసతి సౌకర్యాల కోసం కేటాయించారు.

భూకంపాలను తట్టుకునేలా ఆధునిక వసతులు

ఢిల్లీ భూకంప ప్రభావిత జోన్ లో ఉన్న విషయం తెలిసిందే..! ఒక్కోసారి ఢిల్లీలో నాలుగు నుంచి ఆరు పాయింట్లు మధ్య రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రతలు నమోదవుతాయి.. ఈ నేపథ్యంలోనే వీటిని పట్టుకునేలా అత్యంత భద్రతా ప్రమాణాలతో వందేళ్ళకు పైగా నిలిచేలా ఎంపీల నివాస భవన సముదాయం నిర్మించారు. ఇప్పటివరకు ఎంపీల కోసం1935-1955 మధ్య నిర్మించిన భవనాలు పాతవి కావడం, స్థల కొరతతో ఈసారి 25 అంతస్తుల్లో నూతన అపార్ట్‌మెంట్స్ నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలకు దగ్గరలో ఖరక్ సింగ్ మార్క్‌లో ఎంపీల నూతన భవన సముదాయం నిర్మించారు.

కేటగిరీల వారీగా ఫ్లాట్ల నిర్మాణం

ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 184 టైప్-7 లగ్జరీ ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ఫ్లాట్‌లు టాప్ కేటగిరీని కలిగి ఉన్న టైప్-VIII బంగ్లాల కంటే ఎక్కువ స్థలాన్ని కలిగి ఉన్నాయి. GRIHA 3-స్టార్ రేటింగ్, NBC 2016 ప్రమాణాలతో, గ్రీన్ టెక్నాలజీతో ఫ్లాట్లు నిర్మాణం జరిగింది. భూకంప నిరోధక డిజైన్, బలమైన భద్రతా వ్యవస్థ ఏర్పాటుతో ఎంపీల నివాస సముదాయం ఉంది. నాలుగు నివాస టవర్లలో ఒక్కో టవర్ లో 46 ఫ్లాట్‌లు ఉన్నాయి 5,000 చదరపు అడుగుల కార్పెట్ ప్రాంతాన్ని ఒక్కో ఫ్లాటు కలిగి ఉంది. అత్యాధునిక సౌకర్యాలతో ఎంపీలకు వసతులు.. ఈ ప్లాట్ల లో ఏర్పాటు చేశారు.

ఎన్ని గదులు ఉన్నాయంటే..?

ఎంపీ ప్లాట్‌లో ఐదు బెడ్ రూమ్ గదులు(అటాచ్ బాత్రూమ్స్), ఎంపీకి ఒక ప్రైవేట్ కార్యాలయం, వారి వ్యక్తిగత సహాయకుడి కోసం ఒక కార్యాలయం, ప్రార్థన గది, ఒక చిన్న సమావేశ ప్రాంతంతో కూడిన లివింగ్ రూమ్, ఒక మాడ్యులర్ కిచెన్, ప్రత్యామ్నాయ సిబ్బంది ప్రవేశాలకు ఉపయోగించే బాల్కనీలు, ఎంపీలు, సిబ్బందికి ప్రత్యేక లిఫ్ట్‌లు ఉన్నాయి. ఫ్లాట్‌లలో సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ ఉంది. ఆడియో-విజువల్ సెక్యూరిటీ సిస్టమ్‌లు, PA వర్క్‌స్పేస్‌లు ఉన్నాయి. అదనంగా ప్రతి ఎంపీకి స్టాఫ్ క్వార్టర్స్‌గా రెండు గదులు కేటాయించారు. ప్యాంట్రీ , షేర్డ్ వాష్‌రూమ్‌లతో ఎంపీ స్టాఫ్ క్వార్టర్స్‌ ఉన్నాయి. సౌకర్యాల బ్లాక్‌గా ఐదవ టవర్ పని చేయనుంది. ప్రెస్ బ్రీఫింగ్‌లు, ఎంపీ సమావేశాల కోసం రెండు పెద్ద గదులను ఐదో టవర్‌లో ఏర్పాటు చేశారు. క్యాంటీన్, దుకాణాలు, నివాసితులు సిబ్బంది కోసం ATM వసతులు ఇందులో ఉన్నాయి. డబుల్ బేస్‌మెంట్ తో సుమారు 500 వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం ఉంది. విద్యుత్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి టెర్రస్‌పై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసారు.

అత్యంత సుందరంగా ప్రాంగణం

ఎంపీ నివాస కాంప్లెక్స్‌ బయట నడక మార్గాలు, వీధి దీపాలు ప్రత్యేక అలంకరణలు, సత్యమేవ జయతే చిహ్నం వంటి సింబాలిక్ విగ్రహాలు, పచ్చిక బయళ్ళతో ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్.. భారతదేశ వ్యవసాయ ప్రకృతి దృశ్యాలు, స్వాతంత్ర్య పోరాటం, సైనిక మూలాంశాలు, బిర్సా ముండా, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి జాతీయ చిహ్నాలు ఏర్పాటు చేశారు. భవన నిర్వహణ, మరమ్మత్తు, హెల్ప్ లైన్ సేవలు నిర్వహించడానికి కేంద్ర ప్రజా పనుల విభాగం (CPWD) 24 గంటలు అందుబాటులో ఉండనుంది. ప్రాజెక్టుకు బాధ్యత వహించే సామ్ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ నిర్మాణంలో ఇటుకలను ఉపయోగించకూడదని ఎంచుకున్నట్లు అధికారులు వివరించారు. బదులుగా, నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయడానికి వారు RCC అల్యూమినియం స్టట్టరింగ్‌ను ఉపయోగించారు. సాంప్రదాయ నిర్మాణ పద్ధతిలో పైకప్పును 30-35 రోజుల వ్యవధిలో వేయడానికి వీలు కల్పిస్తుంది.

అప్‌గ్రేడ్‌ల శ్రేణిలో నూతన నిర్మాణాలు

నూతన పద్ధతి ద్వారా, ప్రతి 10-12 రోజులకు పై అంతస్తు స్లాబ్ నిర్మాణం జరిగింది. మొదట రూ. 550 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే చివరికి రూ. 680 కోట్లతో ఎంపీల నివాస ప్రాజెక్టు పూర్తయిందని అధికారులు తెలిపారు. గతంలో ఉన్న 16 టవర్లలో 243 ఫ్లాట్లు కూల్చివేసి ఐదు టవర్ల నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్ట్ CPWD నేతృత్వంలోని MP ల కోసం గృహాల అప్‌గ్రేడ్‌ల శ్రేణిలో నూతనంగా నిర్మించింది. 2020లో డాక్టర్ బి.డి.మార్గ్‌లో 76 కొత్త ఫ్లాట్‌లు, 2019లో నార్త్ అవెన్యూలో 36 డ్యూప్లెక్స్ ఫ్లాట్‌లను CPWD నిర్మించింది. ఎంపీల సీనియారిటీని బట్టి వివిధ రకాల వసతి గృహాలను పార్లమెంట్ హౌసింగ్ కమిటి కేటాయిస్తుంది. ఇప్పటికే అశోక రోడ్డు, అక్బర్ రోడ్, నార్త్ – సౌత్ అవెన్యూ, పండరా రోడ్డు, ఎం.ఎస్. ఫ్లాట్స్, నిజాముద్దీన్ ఈస్ట్, ఫిరోజ్ షా రోడ్ వంటి ప్రభుత్వ కాలనీలలో టైప్ VI, టైప్ VII ఫ్లాట్లలో ఉంటున్న సీనియర్ మంత్రులు, న్యాయమూర్తులు, ఎంపీలు ఉంటున్నారు. తాజాగా నిర్మితమైన ఫ్లాట్లలో నూతనంగా పార్లమెంట్‌కు ఎంపికైన ఎంపీలు ఉండనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *