
వంట గదిలో వంటల రుచిని పెంచడానికి వెనిగర్ వాడతాం. కానీ ఈ సింపుల్ లిక్విడ్ మన బట్టల సంరక్షణలో కూడా చాలా బాగా పనిచేస్తుందని మీకు తెలుసా..? బట్టలను మెరిపించడం నుంచి మొండి మరకలను వదిలించడం వరకు వెనిగర్ చేసే మ్యాజిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బట్టలకు కొత్త మెరుపు
కొన్నిసార్లు బట్టలు ఉతికినా కూడా గట్టిగా.. రఫ్‌గా అనిపిస్తాయి. అలాంటి టైమ్‌లో కొద్దిగా వెనిగర్‌ను నీళ్లలో కలిపి అందులో బట్టలను కొద్దిసేపు నానబెట్టండి. మీరు వాషింగ్ మెషీన్ వాడితే.. ఫాబ్రిక్ సాఫ్ట్నర్ వేసే చోట వెనిగర్ వేయొచ్చు. ఇలా చేయడం వల్ల బట్టలు మెత్తగా మారి.. కొత్త మెరుపును సంతరించుకుంటాయి.
బ్యాడ్ స్మెల్ మాయం
కొన్ని బట్టలు ఉతికినా కూడా చెమట వాసన లాంటి దుర్వాసన వస్తుంటాయి. ఇలాంటి వాటిని వదిలించడానికి వెనిగర్ బాగా హెల్ప్ చేస్తుంది. కొద్దిగా వెనిగర్ ను నీళ్లలో కలిపి ఆ నీటిలో బట్టలను ఉతకండి. దీంతో చొక్కాలు, షర్ట్స్ లోని చెమట వాసన మొత్తం పోతుంది.
మొండి మరకలకు చెక్
బట్టలపై ఉన్న కొన్ని మొండి మరకలు మామూలు సోప్ తో పోవు. అలాంటి వాటిపై ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కు కొంచెం సబ్బు పౌడర్ కలిపి.. ఆ మిశ్రమాన్ని మరక ఉన్న చోట రాయండి. కాసేపు అలాగే ఉంచి ఆ తర్వాత ఉతికితే మరకలు చాలా వరకు మాయమైపోతాయి.
పాత బట్టలకు కొత్త లుక్
ఎక్కువ సార్లు ఉతకడం వల్ల బట్టలు పాతబడి రంగు తగ్గినట్లు అనిపిస్తాయి. వాటి మెరుపును తిరిగి తీసుకురావడానికి వెనిగర్ వాడొచ్చు. వేడి నీటిలో వెనిగర్ కలిపి ఆ ద్రావణంలో బట్టలను రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు వాటిని మామూలుగా ఉతికితే.. బట్టలు మళ్లీ కొత్తగా కనిపిస్తాయి.
రంగులు వెలిసిపోకుండా రక్షణ
కొత్తగా కొన్న కలర్ బట్టల రంగు వెలిసిపోతుందేమో అని భయం ఉంటుంది. అలాంటి టైమ్ లో కొద్దిగా వెనిగర్‌ను నీళ్లలో కలిపి బట్టలను నానబెడితే.. రంగు మసకబారే ఛాన్స్ తగ్గుతుంది. ముఖ్యంగా రంగు ఉన్న బట్టలు ఇలా శుభ్రం చేస్తే వాటి అందం చెక్కుచెదరకుండా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వెనిగర్‌తో లాభాలు చాలా ఉన్నా.. అన్ని రకాల బట్టలపై వాడకూడదు. ముఖ్యంగా ఎలాస్టిక్ ఉన్న బట్టలు వెనిగర్ తో శుభ్రం చేస్తే అవి పాడైపోతాయి. ఏ బట్టపై అయినా వెనిగర్ వాడే ముందు.. దానిపై ఉండే ట్యాగ్ మీద ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించడం మంచిది.