నల్లగొండ జిల్లా కనగల్ మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఎర్రవెల్లి యాదగిరిరెడ్డి పెద్ద కుమారుడైన ఎర్రవల్లి ప్రవీణ్ కుమార్ రెడ్డి (27) దివ్యాంగుడు.. నల్లగొండలోని దివ్యాంగుల వసతి గృహంలో ఉంటూ సిద్దార్థ కళాశాలలో పీజీ చదువుతున్నాడు. వారం రోజుల క్రితం తన అవసరాల కోసం ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆన్ లైన్‌లో ఓ యాప్ నిర్వాహకులను సంప్రదించాడు. దీంతో నిర్వాహకులు ప్రవీణ్ రెడ్డి వివరాలు తీసుకొని ఆయన ఖాతాకు రూ.4వేలను పంపించారు. దీంతో ఆ యాప్ పై ప్రవీణ్ రెడ్డి నమ్మకం పెంచుకున్నాడు. మరో నాలుగు రోజుల తర్వాత రూ.లక్ష కావాలని నిర్వాహకులను అడిగాడు. అయితే ఇది అదునుగా యాప్ నిర్వాహకులు ప్రవీణ్ రెడ్డి నమ్మకాన్ని సొమ్ము చేసుకున్నారు.
తమ అకౌంట్‌కు రూ.1.27లక్షలు పంపిస్తే వెంటనే రూ.6.27లక్షలు ఖాతాలో జమ చేస్తామని యాప్ నిర్వాహకులు నమ్మబలికారు. యాప్ నిర్వాహకుల మాయ మాటలను నమ్మిన ప్రవీణ్ రెడ్డి.. స్నేహితులు, బంధువుల వద్ద రూ.1.27 లక్షలను అప్పు చేసి యాప్ నిర్వాహకుల అకౌంట్‌కు పంపాడు. అయినా యాప్ నిర్వాహకుల నుండి ఎలాంటి సమాధానం రాకపోగా లోన్ డబ్బులను కూడా అకౌంట్‌లో వేయలేదు.
దీంతో ప్రవీణ్ కుమార్ రెడ్డి.. యాప్ నిర్వాహకులను సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో లోన్ యాప్ నిర్వాహకులతో మోసపోయానని భావించి ప్రవీణ్ కుమార్ మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ప్రవీణ్ సూసైడ్ చేసుకున్నాడు. నల్లగొండ రైల్వేస్టేషన్ సమీపంలో ఫ్లైఓవర్ సమీపంలో తిరుపతి నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా.. లోన్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్‌లో ఎలాంటి వాగ్గానాలను నమ్మవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..