రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో మోదీ సర్కార్ పనిచేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాలలో ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన (PMKSY) ఒకటి. 15వ ఆర్థిక సంఘం కింద ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం రూ.6,520 కోట్ల ప్యాకేజీని ఆమోదించింది. ఇందులో అదనంగా రూ.1,920 కోట్లు జత చేసింది.
ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద జూన్ 2025 వరకు మొత్తం 1,601 ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వీటిలో 1,133 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇవి సంవత్సరానికి 255.66 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని సృష్టించాయి. ఆమోదించిన అన్ని ప్రాజెక్టులు అమలులోకి వస్తే, 50 లక్షలకు పైగా రైతులు ప్రయోజనం పొందుతారు. ఏడు లక్షలకు పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా పనిదినాలు ఉపాధి అవకాశాలు కలుగుతాయని భావిస్తున్నారు. అంతేకాదు ఈ రంగంలో రూ.21,803.19 కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.
ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనను మొదట 2017లో ప్రారంభించారు. ఈ పథకానికి ప్రభుత్వం అప్పుడు రూ.31,400 కోట్ల పెట్టుబడి అంచనాలో రూ.6,000 కోట్లు కేటాయించింది. ఇప్పుడు, 15వ ఆర్థిక సంఘం కింద, ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తోంది. ఈసారి ప్రభుత్వం అదనంగా రూ.1,920 కోట్లు అందిస్తోంది. ఇందులో రూ.1,000 కోట్లు 50 బహుళ-ఉత్పత్తి ఆహార వికిరణ యూనిట్లు, 100 ఆహార పరీక్షా ప్రయోగశాలలను ఏర్పాటు చేయడానికి ఖర్చు చేయనున్నారు. సంపద పథకం కింద కొనసాగుతున్న వివిధ పనులకు రూ.920 కోట్లు ఉపయోగించనున్నారు.
ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన అంటే ఏమిటి?
ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడానికి ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనను ప్రారంభించింది. రైతుల పొలం నుండి రిటైల్ అవుట్లెట్ వరకు ఆహార సరఫరా గొలుసును బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఈ పథకం కారణంగా, రైతులు తమ ఉత్పత్తులకు మంచి ధరలు పొందుతారు. ఉత్పత్తుల వృధా తగ్గుతుంది. రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనను పెంచుతుంది. ప్రాసెస్ చేసిన ఆహార ఎగుమతులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం కూడా సాధ్యం అవుతుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..