Fruit Custard.. అమ్మ రాఖీ పండుగ రోజున ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి రుచికరమైన స్వీట్స్ తింటుందని బాధపడుతున్నారా..? అయితే మీరు ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేసి అమ్మకు సర్ప్రైజ్ ఇవ్వండి. పండ్లతో తయారు చేసే ఈ కస్టర్డ్ ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్, రెండు టీస్పూన్ల బ్రౌన్ షుగర్ వేసి కొద్దిగా నీటిని కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పాలను మరిగించి ఈ మిశ్రమాన్ని అందులో వేసి గడ్డలు కట్టకుండా బాగా కలపాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఈ కస్టర్డ్ ను ఒక గిన్నెలో పోసి చల్లారనివ్వాలి. ఆ తర్వాత అర కప్పు ముక్కలు చేసిన యాపిల్, ఒక చిన్న అరటిపండు, పది నుంచి పన్నెండు ముక్కలు చేసిన ద్రాక్షను దాని పైన వేసి సర్వ్ చేయాలి. కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా కూడా వడ్డించవచ్చు.
Oats Kheer.. బియ్యానికి బదులు ఓట్స్‌తో చేసే ఈ ఓట్స్ ఖీర్ చాలా ఆరోగ్యకరం. ఇందులో ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, అరటిపండు వేయడం వల్ల రుచి మరింత పెరుగుతుంది. ఈ ఖీర్ చేయడానికి మొదటగా ఒక కప్పు ఓట్స్‌ని నాలుగు నుంచి ఐదు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత అర లీటరు పాలు తీసుకుని అందులో నాలుగు నుంచి ఐదు ఖర్జూరాలు, ఆరు నుంచి ఏడు బాదం పప్పులు, రెండు యాలకులు వేసి మరిగించాలి. పాలు బాగా మరిగాక, వేయించిన ఓట్స్ వేసి ఖీర్ చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. చివరగా, ఒక అరటిపండు ముక్కలు చేసి వేసి ఆరు నుంచి ఏడు ఎండుద్రాక్షతో అలంకరించి, వేడిగా లేదా చల్లగా వడ్డించవచ్చు. కావాలంటే కొద్దిగా పంచదార కూడా వేసుకోవచ్చు.
Yogurt Parfait.. రాఖీకి హెల్తీగా, టేస్టీగా ఉండే స్వీట్ చేయాలనుకుంటే యోగర్ట్ పార్ఫైట్ బెస్ట్ ఆప్షన్. ఈ యోగర్ట్ పార్ఫైట్ ను పొరలు పొరలుగా వివిధ పండ్లు, ఓట్స్, పెరుగుతో తయారు చేయవచ్చు. దీన్ని తయారు చేయడానికి మొదటగా మీకు నచ్చిన పండ్లను ముక్కలుగా కట్ చేసి గోవా జూస్‌తో కలిపి ఒక గిన్నెలో పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గాజు గ్లాసులో లేదా జార్లో 250 గ్రాముల పెరుగు వేసి దానిపై పండ్ల పొర వేయాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టిన ఓట్స్, మళ్లీ పెరుగు, పైన్ నట్స్, సెరల్స్ (cereals) వేసి ఇలా పొరలు పొరలుగా సర్దుకోవాలి. చివరగా పైన నట్స్ చల్లి చల్లగా వడ్డించాలి.
Ragi Coconut Ladoo.. పండుగ అంటే లడ్డు ఉండాల్సిందే. అయితే ఈసారి రాగి కొబ్బరి లడ్డుతో మీ ఇంట్లో వాళ్లకు హెల్తీ స్వీట్స్ చేసి పెట్టండి. దీనిని తయారు చేయడం చాలా తేలిక. మొదటగా ఒక కప్పు రాగి పిండిలో చిటికెడు ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు చల్లుతూ కలపాలి. ఆ తర్వాత పావు కప్పు కొబ్బరి తురుమును కలిపి.. ఆ మిశ్రమాన్ని పదిహేను నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి. చల్లారిన తర్వాత పావు కప్పు పచ్చి బెల్లం, అలాగే వేయించి పొడి చేసుకున్న పావు కప్పు పల్లీలను వేసి బాగా కలిపి చిన్న లడ్డులుగా చుట్టుకోవాలి. ఈ లడ్డులు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
Two-In-One Phirni receipe.. చక్కెర వాడకుండా ఇంట్లోనే టేస్టీగా ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే.. ఈ టూ-ఇన్-వన్ ఫిర్ని మంచి ఎంపిక. పిస్తా, రోజ్ ఫ్లేవర్ లతో ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఈ ఫిర్నిని చేయడానికి ముందుగా అరగంట నానబెట్టిన 60 గ్రాముల బియ్యాన్ని కొద్దిగా పాలతో కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఐదు కప్పుల పాలను మరిగించి గ్రైండ్ చేసిన బియ్యం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత ఆరు యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్ల పిస్తా పేస్ట్, పావు టీస్పూన్ రోజ్ ఎసెన్స్, కొద్దిగా మిఠాయి రంగు, ముప్పావు కప్పు ఆర్టిఫిషియల్ స్వీటనర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి వాటిని బౌల్స్‌లో పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. చివరగా పది తరిగిన బాదం పప్పులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
Jaggery Panna Cotta.. పంచదారకు బదులుగా బెల్లంతో చేసే ఈ పన్నా కొట్టా ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ఇంట్లోనే సులభంగా తయారు చేయవచ్చు. ముందుగా రెండు టీస్పూన్ల జెలటిన్ ను నీటిలో నానబెట్టాలి. మరో గిన్నెలో రెండు కప్పుల పాలు, పావు కప్పు బెల్లం, మూడు యాలకులు, ఒక చిటికెడు యాలకుల, దాల్చినచెక్క పొడి వేసి బాగా వేడి చేయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, నానబెట్టిన జెలటిన్ వేసి మిశ్రమం చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మౌల్డ్ లలో పోసి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా సర్వ్ చేయాలి.
Faldhari Badam ki Barfi.. రాఖీకి షుగర్ లేకుండా రుచికరమైన స్వీట్స్ చేయాలనుకుంటే.. ఇంట్లో సులభంగా ఫల్ధారి బాదం బర్ఫీని తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక నాన్ స్టిక్ పాన్‌లో ఒకటిన్నర కప్పుల మావా, ఒక కప్పు మిక్స్ డ్రై ఫ్రూట్స్, ఒక కప్పు మిక్స్ చేసిన టుటీ ఫ్రూటీ వేసి ఐదు నిమిషాలు వేడి చేయండి. తర్వాత పావు టీస్పూన్ యాలకుల పొడి, కొద్దిగా జాపత్రి, నట్మెగ్ పౌడర్ వేసి ఆ మిశ్రమం గట్టిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత దాన్ని నెయ్యి రాసిన ఒక టిన్‌లో వేసి ఐదు గంటలు ఫ్రిజ్‌లో ఉంచాలి. అది గట్టిగా మారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయండి.