
మెడికల్ కాలేజీల్లోనూ గంజాయి గుప్పుమంటోంది..! స్టెతస్కోప్ పట్టాల్సిన డాక్టర్లు.. మత్తుకు చిత్తవుతున్నారు…! వైద్య వృత్తికే అవమానం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. రోల్ మోడల్స్‌గా ఉండాల్సినవాళ్లు.. డ్రగ్ అడిక్ట్‌లుగా మారుతున్నారు. లేటెస్ట్‌గా ఈగల్ టీమ్‌కి దొరికిన డాక్టర్స్ డ్రగ్స్ డైరీ షాక్‌కి గురిచేస్తోంది. అటు పెడ్లర్ల లావాదేవీలు చూసి అధికారులే అవాక్కయ్యారు.
వైద్యో నారాయణో హరి అన్నారు..! అంటే వైద్యుడు దేవుడితో సమానం. సమాజంలో డాక్టర్‌కు అంతటి హోదానిచ్చాం మనం. కానీ వరుస ఘటనలు వైద్య వృత్తికే మచ్చ తెచ్చేలా ఉన్నాయి. గతకొన్ని రోజులుగా డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతూ వందలాది మందిని అరెస్ట్ చేసిన ఈగల్ టీమ్.. పక్కా సమాచారంతో మెడిసిటీ మెడికల్ కాలేజీపై ఫోకస్ పెట్టింది. ఆ కాలేజీకి డ్రగ్స్ ఎలా వెళ్తున్నాయి..? ఎవరు తీసుకెళ్తున్నారు..? అంటూ నిఘా పెట్టి పలువురిని అరెస్ట్ చేయడంతో పాటు షాకింగ్ విషయాలు వెల్లడించారు అధికారులు.
జరీనాభాను, అర్ఫాత్ ఖాన్.. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను పట్టుకున్నారు ఈగల్ టీమ్ అధికారులు. ఆ ఇద్దరి ఫోన్ కాల్స్, యూపీఐ ట్రాన్సాక్షన్‌ను ట్రాక్ చేసి 100 మంది డ్రగ్స్ కన్జూమర్స్‌ను పట్టుకున్నారు. ఆ వందమందిలో 32మంది మెడిసిటీ కాలేజీకి చెందిన మెడికోలు ఉండటం షాక్‌కు గురిచేస్తోంది. ఆ ముప్పై రెండు మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినవారిలో ఇద్దరు మహిళా డాక్టర్లు ఉన్నట్లు తేల్చారు.
ఈగల్ టీమ్‌కి దొరికిన ఇద్దరు పెడ్లర్లు మామూలోళ్లు కాదు..! అర్ఫాత్‌ఖాన్, జరీనాభానును అరెస్ట్ చేసిన అధికారులు విస్తుపోయే వాస్తవాలు వెల్లడించారు. అర్పాత్‌ఖాన్ దగ్గర నుంచి 6కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జరీనాభాను అకౌంట్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ చూసి అధికారులే షాక్ అయ్యారు. కోటి యాభై లక్షల రూపాయల లావాదేవీలను గుర్తించారు. అందులో 26 లక్షల రూపాయలు హైదరాబాద్‌కు చెందిన డీలర్స్ నుంచి వచ్చినట్లు తెలిపారు.
డ్రగ్స్ సరఫరా, ఆర్ధిక లావాదేవీలు అటుంచితే… ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు వెల్లడించారు అధికారులు. ఈ ఇద్దరికి సుమారు 100మంది డ్రగ్స్ డీలర్లతో లింకులున్నట్లు గుర్తించారు. అందులో 51మంది హైదరాబాద్‌లో ఉన్నట్లు తేల్చారు. వాళ్లను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు.
మొత్తంగా… మెడిసిన్ వెళ్లాల్సిన మెడికల్ కాలేజీకి డ్రగ్స్ వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది..! ఒకే కాలేజీకి చెందిన 32 మంది మెడికోలు డ్రగ్స్‌కు బానిసవ్వడం షాక్‌కి గురిచేస్తోంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దొరికిన ఇద్దరు పెడ్లర్లతో లింక్స్ ఉన్న ఏ ఒక్కరినీ వదిలేదే లేదంటున్నారు.