మృతదేహాలు లభించని కార్మికులకు పరిహారంపై రాని క్లారిటీ.. అయోమయంలో సుగాచీ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కుటుంబాలు!

మృతదేహాలు లభించని కార్మికులకు పరిహారంపై రాని క్లారిటీ.. అయోమయంలో సుగాచీ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కుటుంబాలు!


సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచీ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించిన సుమారు 30 మందికిపైగా కార్మికులు మృతి చెందడం యావత్‌ తెలంగాణను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రియాక్టర్‌ పేలుడు దాటికి కొందరి శరీరాలు కాలిబూడిదైపోగా.. మరికొందరి శరీర భాగాలు చెల్లచెదురుగా పడిపోయిన దృశ్యాలు ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురిచేశాయి. అయితే ఈ ప్రమాదంలో మరణించిన కొందరి కార్మికుల మృతదేహాలు లభించినప్పటికి.. గల్లంతైన కార్మికుల విషయంలో మాత్రం ప్రస్తుతం సందిగ్ధత నెలకొంది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు గల్లంతైనట్టు కంపెనీ యాజమాన్యం, జిల్లా కలెక్టర్ చెప్తున్నా.. ఇప్పటి వరకు వారి మృతదేహాలు మాత్రం లభించలేదు. ప్రమాద స్థలంలో శిథిలాల తొలగింపు పూర్తికావస్తున్న మృతదేహాలు లభ్యం కాకపోవడంతో వారి మృతదేహాలు పూర్తిగా మంటల్లో కాలిపోయి ఉంటాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఐదురోజులు గడుస్తున్నా లభించని మృతదేహాలు..

ప్రమాదం జరిగి ఐదు రోజులు గడుస్తున్నా మృతదేహాలు లభించకపోవడంతో గల్లంతయిన వారిపై ఆశలు వదులుకోవాల్సిందేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు గల్లంతైన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని సిఎస్ నేతృత్వంలోని కమిటీ గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. కమిటీ ఇచ్చిన సమాచారం మేరకు సీఎస్‌ రామకృష్ణరావు శుక్రవారం ఐలా భవనంలో గల్లంతైన కార్మికుల కుటుంబాలతో సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితిని వారికి వివరించే ప్రయత్నం చేశారు. కాగా ప్రమాదంలో చనిపోయి మృతదేహాలు లభించిన వారికి నష్టపరిహారం చెల్లిస్తామని కంపెనీ ప్రకటించినప్పటికీ గల్లంతైన వారి కుటుంబాల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో తమ పరిస్థితి ఏంటని బాధిత కుటుంబ సభ్యులు సీఎస్‌ను నిలదీసినట్టు తెలుస్తోంది. దీనిపై సీఎస్‌ స్పందిస్తూ చాలామంది కాలిపోయినట్టుగా గుర్తించామని, ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తామంటూ బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చినట్టు సమాచారం.

మృతదేహాలు లభించని కార్మికుల పరిహారంపై రాని క్లారిటీ?

అయితే గల్లంతైన కార్మికుల విషయంలో అందరికీ న్యాయం చేస్తామని సీఎస్‌ హామీ ఇచ్చినప్పటికీ.. కాంట్రాక్టు కార్మికుల గల్లంతు, వారి కుటుంబాలకు నష్టపరిహారంపై మాత్రం కంపెనీ ఎలాంటి ప్రకటన చేయనట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే గల్లంతైన కార్మికుల మృతదేహాలు లభ్యం కాకపోతే వారి కుటుంబాలకు నష్ట పరిహారం ఇచ్చే అవకాశంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *