మీ పిల్లలు టీవీ చూస్తూ మాత్రమే తింటున్నారా..? అయితే జాగ్రత్త..! చాలా మంది తల్లిదండ్రులు చేసే ఈ పొరపాటు వల్ల పిల్లలు కార్టూన్‌లు, రైమ్‌లు చూస్తూ తింటే సులభం అవుతుందని భావిస్తారు. కానీ దాని వల్ల కలిగే నష్టాలు చాలా ఎక్కువ. డాక్టర్ కరుణ్య చెప్పిన దాని ప్రకారం.. ఈ అలవాటు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
టీవీ చూస్తూ తినడం వల్ల కలిగే నష్టాలు
- ఆకలి, తృప్తి తెలియదు.. స్క్రీన్ చూస్తూ తింటున్నప్పుడు, పిల్లలకు తాము ఎంత తింటున్నారో తెలియదు. దాని వల్ల ఎక్కువ తినేయడం లేదా సరిగా తినకపోవడం జరుగుతుంది. దీని వల్ల పోషకాహార లోపం, అధిక బరువు లాంటి సమస్యలు రావచ్చు.
- స్వతంత్రంగా తినడం రాదు.. స్క్రీన్ మీద ఆధారపడి తినడం వల్ల పిల్లలు తమంతట తాముగా తినడం నేర్చుకోలేరు. ఇది వారి స్వతంత్రతను తగ్గిస్తుంది.
- జీర్ణక్రియ మందగిస్తుంది.. ఏకాగ్రత లేకుండా తినడం వల్ల పిల్లలు ఆహారాన్ని సరిగా నమలరు. దాని వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది.
- కుటుంబానికి దూరం.. భోజన సమయం కుటుంబ సభ్యులందరూ కలిసి సంతోషంగా గడిపే సమయం. టీవీ, ఫోన్ వల్ల ఆ సమయం పోతుంది.
దీనికి పరిష్కారం ఏంటి..?
- స్క్రీన్ లేకుండా తినడం అలవాటు చేయండి.. ఇంట్లో భోజనానికి టీవీ, ఫోన్ లేకుండా ఒక రూల్ పెట్టుకోండి.
- అందరూ కలిసి తినండి.. కుటుంబమంతా కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తినండి.
- ఆహారం గురించి చెప్పండి.. తిండి రంగులు, రుచులు, వాసనల గురించి పిల్లలతో మాట్లాడండి.
- కథలు, పాటలు చెప్పండి.. స్క్రీన్ బదులు కథలు చెప్పడం, పాటలు పాడటం అలవాటు చేయండి.
ఈ చిన్న మార్పులు పిల్లల మంచి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి. డాక్టర్ కరుణ్య చెప్పిన ఈ చిట్కాలు పిల్లల ఆరోగ్యం, మనసుపై చాలా మంచి ప్రభావం చూపుతాయి.