ప్రతి ఒక్కరి వ్యక్తిగత ఇష్టాలు వేరు. కానీ మీ కుక్క ఆరోగ్య పరిస్థితి, ప్రవర్తన, శుభ్రతను బట్టి కలిసి పడుకునే విషయం నిర్ణయించుకోవాలి. కొన్నిసార్లు ఇది మంచి అనుభవమని చెప్పొచ్చు. మీరు కుక్కను బాగా చూసుకుంటే అది ఆరోగ్యంగా, మానసికంగా సురక్షితంగా ఉంటే.. మీతో కలిసి నిద్రపోవడం మనుషులు జంతువుల మధ్య బంధాన్ని బలపరుస్తుంది.
కుక్కతో కలిసి పడుకునేటప్పుడు అందరికీ ఒక మానసిక సౌకర్యం ఉంటుంది. కుక్కకు కూడా ఇది ఒక బలమైన మానసిక మద్దతు. అలాగే జంతువులతో దగ్గరగా ఉండటం వల్ల మన ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పెంపుడు జంతువుల వల్ల చాలా మంది యజమానులు సంతోషంగా ఉంటారు. కుక్క తమ యజమానుల ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
కుక్కను మీతో పడుకోబెట్టడం ద్వారా అవి సురక్షితంగా భావిస్తాయి. వాటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది మీకు మంచి నిద్రకు కూడా తోడ్పడుతుంది. అయితే ప్రతి కుక్కను మీతో కలిసి పడుకోబెట్టలేరు. మీ కుక్కకు కోప స్వభావం ఉంటే లేదా అది ఒత్తిడికి గురైతే దాన్ని వేరే సురక్షిత స్థలంలో ఉంచడం మంచిది.
కొన్నిసార్లు కుక్కల వల్ల మన నిద్ర భంగమవుతుంది. అలాంటి సందర్భాల్లో వాటిని వాటి ప్రత్యేక స్థలంలో ఉంచడమే మంచిది. పరిశుభ్రత విషయాలు కూడా మనం గమనించాలి. ఇంట్లో ఎవరికైనా శ్వాస సంబంధ సమస్యలు లేదా చర్మ సంబంధ అలెర్జీలు ఉంటే.. అలాంటి వారు కుక్కతో కలిసి పడుకోకుండా ఉండటం మంచిది.
మీతో కలిసి కుక్కను పడుకోబెట్టాలనుకుంటే.. కుక్కకు సౌకర్యవంతమైన, సురక్షితమైన, స్థిరమైన పడకను ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. ప్రతి ఇంటి పరిస్థితులు వేరు కావచ్చు. అందుకే మీరు మీ కుక్క మానసిక అవసరాలను.. మీ ఆరోగ్యం, విశ్రాంతిని సమతుల్యం చేసుకోవాలి.