మీ ఊళ్ళో గుళ్ళల్లో పంచలోహ విగ్రహాలు ఉన్నాయా. అయితే జాగ్రత్త పడండి. అవి వీరి కంటకనుక పడ్డాయో ఇక అంతే సంగతులు. భక్తులకు మూల విరాట్టు ముఖ్యం కానీ దొంగలకు మాత్రం పంచలోహ విగ్రహాలే టార్గెట్. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో వీటి కాలాన్ని బట్టి కోట్ల రూపాయల్లో ధరలు పలుకుతాయి. ఈ పంచలోహ విగ్రహాలను ఎంత నగిషీగా చెక్కితే అంత ప్రాధాన్యత లభిస్తుంది. కొన్ని పంచలోహ విగ్రహాలకు రైస్ పుల్లింగ్, ఇతర దైవిక శక్తులు ఉంటాయని నమ్మడం వల్లే వీటికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగింది. మరీ ముఖ్యంగా భారతదేశంలో తయారు చేసిన అతి ప్రాచీన పంచలోహ విగ్రహాలకు ఎక్కడ లేని గిరాకీ ఉంటుంది. దీంతో వీటిపై దొంగల కన్ను ఎప్పుడూ ఉంటుంది.
అయితే ఈ పంచలోహ విగ్రహాలపై కన్నేసిన కొందరు కేటుగాళ్లు తాజాగా ప్రకాశంజిల్లా దర్శనమిచ్చారు. కుంభం మండలం తెల్లదిన్నే గ్రామంలోని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కోదండ రామస్వామి ఆలయంలోకి చొరబడి వందేళ్ళ క్రితం ప్రతిష్టించిన సీతా, రామ సేమేత లక్ష్మణ విగ్రహాలను ఎత్తుకెళ్ళారు. ఆంజనేయస్వామి విగ్రహం ఇత్తడిది కావడంతో ఆ విగ్రహాన్ని అక్కడే వదిలేసి వెల్లిపోయారు. చిన్న దేవాలయం కావడం, ఊరికి కొద్ది దూరంలో ఉండటంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీన్ని గమనించిన పూజారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు పోలీసులు. క్లూస్ టీంని రంగంలోకి దించి వేలిముద్రలు సేకరించారు. దొంగలను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని సీఐ మల్లికార్జున తెలిపారు.
పంచలోహ విగ్రహాలే ఎందుకు…
పంచలోహ విగ్రహాలు దేవతామూర్తులను తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటిని తయారు చేయడానికి బంగారం, వెండి, రాగి, ఇనుము, జింక్ ఇలా ఐదు లోహాలను ఉపయోగిస్తారు. ఈ పంచలోహాలతో తయారు చేసిన విగ్రహాలను హిందూ మతంలో చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఇలా తయారు చేసిన విగ్రహాల్లో దైవిక శక్తులు ఉంటాయని నమ్ముతారు. మూల విరాట్టు తరువాత ఈ విగ్రహాలను పూజించే వారితో దేవతలకు దగ్గర సంబంధం ఏర్పడుతుందని భావిస్తారు. ఈ విగ్రహాలను కలిగి ఉండటం వల్ల జీవితంలో సమతుల్యత, ఆత్మవిశ్వాసం, అదృష్టం, ఆరోగ్యం, శ్రేయస్సు, మనశ్శాంతి లభిస్తుందని పండితులు చెబుతారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..