
“వందేమాతరం” కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త అధికారిక మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు జనవరి 28, 2026 నుంచి అమలులోకి వచ్చాయి. ఈమేరకు అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. జాతీయ గీతం కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన మాదిరిగానే, వందేమాతరం గీతం పాడటం, ప్రదర్శన కోసం స్పష్టమైన ప్రోటోకాల్‌లను పాటించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఏమిటి?
- కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఏదైనా ప్రభుత్వ లేదా అధికారిక కార్యక్రమంలో ‘వందేమాతరం’ పాడినా లేదా ప్లే చేసినా, దాని పూర్తి ఆరు చరణాలకు ప్రాధాన్యత ఇవ్వా్ల్సి ఉంటుంది. ఇప్పటివరకు, మొదటి రెండు చరణాలు మాత్రమే పాడేవారు, కానీ కొత్త మార్గదర్శకాల ప్రకారం పూర్తి ఆరు చరణాలు పాడాల్సిందే.. ఆచరణాత్మక పరిస్థితుల ప్రకారం ప్రదర్శన, ఆకృతిని నిర్ణయించవచ్చని స్పష్టం చేసినప్పటికీ, మొత్తం పాటను అధికారికంగా ప్రామాణికంగా పరిగణిస్తారు.
- ప్రస్తుతం, ప్రత్యేక ప్రభుత్వ కార్యక్రమాలలో, వందేమాతరం అధికారిక ఆరు చరణాలను పాడటం లేదా ప్లే చేయడం తప్పనిసరి. దీని వ్యవధి 3 నిమిషాల 10 సెకన్లుగా నిర్ణయించారు.
- ఒక కార్యక్రమంలో ‘వందేమాతరం’, ‘జన గణ మన’ రెండూ ప్రదర్శించినట్లతే, ముందుగా ‘వందేమాతరం’ ప్రదర్శించిన తరువాత జాతీయ గీతం ‘జన గణ మన’ ప్రదర్శించాల్సి ఉంటుంది. అధికారిక కార్యక్రమాలలో ఏకరూపతను నిర్ధారించడానికి ఈ ఆదేశం ఇప్పుడు అధికారికంగా నిర్ణయించారు.
- గౌరవం , మర్యాదలు (ప్రోటోకాల్) కూడా జాతీయ గీతం ఆలపించేటప్పుడు ఉన్నట్లుగానే, “వందేమాతరం” పాడేటప్పుడు లేదా వాయించేటప్పుడు హాజరైన వారు గౌరవంగా నిలబడాలని నిర్దేశించారు. జాతీయ గీతం పట్ల సమాన గౌరవాన్ని నిర్ధారించడానికి దీనిని ఉద్దేశించారు.
- త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం, రాష్ట్రపతి కార్యక్రమాలకు రాక, రాష్ట్రపతి ప్రసంగాలు, దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించే ముందు, తరువాత, అలాగే గవర్నర్ల రాక, గవర్నర్ ప్రసంగాలకు ముందు, తరువాత వంటి అనేక అధికారిక సందర్భాలలో వందేమాతరం పాడాల్సిందే. పద్మ అవార్డుల ప్రదానోత్సవం వంటి పౌర అవార్డు ప్రదానోత్సవాలలో రాష్ట్రపతి హాజరైన ఏదైనా కార్యక్రమంలో కూడా వందేమాతరం పాడుతారు.
- ఈ మార్గదర్శకాలు ప్రధానంగా ప్రభుత్వ వేడుకలు, జాతీయ, రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు, విద్యా సంస్థల అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ ప్రోటోకాల్‌తో కూడిన ఇతర కార్యక్రమాలకు వర్తిస్తాయి. ఇది శిక్షాత్మక చట్టం కాదు, ప్రభుత్వ కార్యక్రమాలలో అనుసరించాల్సిన పరిపాలనా ప్రోటోకాల్. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
150 సంవత్సరాలు పూర్తి
బంకించంద్ర ఛటర్జీ రచించిన జాతీయ గేయం వందేమాతరం. 1875 నవంబర్ 7న అక్షయ నవమి పర్వదినం సందర్భంగా దీనిని రచించినట్లు చెబుతారు. ఇది 2025 నాటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆయన రాసిన ఆనందమఠ్ అనే నవలలో మొదటగా ఈ గేయం వెలుగు చూసింది. ఈ నవల అప్పట్లో బంగదర్శన్ అనే సాహిత్య పత్రికలో ధారావాహికగా వెలువడింది. ఆ తర్వాత 1882లో ఒక ప్రత్యేక పుస్తకంగా వచ్చింది. భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలమది. జాతీయ గుర్తింపు భావన, వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందేమాతరం.. మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చింది.
జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించింది. తర్వాత కొద్ది కాలంలో ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారింది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వందేమాతరం స్వాతంత్య్ర పోరాటంలో చారిత్రక పాత్ర పోషించిందని ప్రకటిస్తూ, జాతీయ గీతం జనగణమనతో సమానంగా సమాన గౌరవం ఇచ్చారు.
వందేమాతరానికి ఉన్న చారిత్రక, జాతీయ ప్రామూఖ్యతను గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఈ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించే ప్రతిపాదనకు 2025 అక్టోబర్ 1న ఆమోదం తెలిపింది. 2025 నవంబర్ 7 నుంచి 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి..