రాగల రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు-ఈశాన్య దిశగా అరుణాచల్ ప్రదేశ్ వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర అంతర్గత కర్ణాటక దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టం 5.8 కిమీ మధ్య ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 13న వాయువ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో సంబంధిత అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
11 జిల్లాలకు ఎల్లో అలర్ట్..
రాగల రెండు, మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పైన పేర్కొన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి