
ప్రపంచవ్యాప్తంగా మరోసారి చికున్‌గున్యా వైరస్ హడలెత్తిస్తోంది. అనేక ప్రాంతాల్లో చికున్‌గున్యా వైరస్ కేసులు మరోసారి తల ఎత్తుతున్నాయి. పెరుగుతున్న కేసుల దృష్ట్యా, యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC), చైనా తోపాటు అనేక దేశాలకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది.
ముఖ్యంగా దోమల ద్వారా సంక్రమించే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయా ప్రదేశాలకు వెళ్లే అమెరికా ప్రయాణికులకు ప్రమాదాల గురించి CDC హెచ్చరించింది. ముఖ్యంగా చైనాలో చికున్‌గున్యా కేసులు తీవ్రంగా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ 7,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని స్థానిక మీడియా పేర్కొంది. క్రమక్రమంగా పెరుగుతోంది.
గ్లోబల్ మీడియా కథనాల ప్రకారం, ఈ సంవత్సరం ఇప్పటివరకు, మధ్య-దక్షిణ అమెరికా, ఆఫ్రికా, హిందూ మహాసముద్ర ప్రాంతం, ఆసియాలోని అనేక ప్రాంతాలలో దాదాపు 2.4 లక్షల చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ఇందులో 90 మరణాలు కూడా సంభవించాయి. మరీ ముఖ్యంగా చైనాలోని దక్షిణ ప్రావిన్స్ గ్వాంగ్‌డాంగ్‌లో జూన్ 2025 నుండి 7,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ నగర జనాభా దాదాపు 78 లక్షలు. అదే సమయంలో, 2019 తర్వాత హాంకాంగ్‌లో మొదటి చికున్‌గున్యా కేసు ఇటీవలే నమోదైంది.
చికున్‌గున్యా కేసులు పెరుగుతున్న దృష్ట్యా, CDC లెవల్-2 ట్రావెల్ హెల్త్ నోటీసును జారీ చేసింది. దీనికి మరింత జాగ్రత్త అవసరమని సూచించింది. ఇందులో దక్షిణ అమెరికాలోని బొలీవియా, చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్, మడగాస్కర్, మారిషస్, మయోట్టే, రీయూనియన్, సోమాలియా సహా హిందూ మహాసముద్ర ప్రాంతంలోని శ్రీలంక వంటి దేశాలు ఉన్నాయి. దీంతో పాటు, బ్రెజిల్, కొలంబియా, భారతదేశం, మెక్సికో, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్‌లకు సంబంధించి US ప్రయాణికులకు CDC హెచ్చరికను జారీ చేసింది.
అమెరికాలో చికున్‌గున్యా సర్వసాధారణం. అయితే, CDC డేటా ప్రకారం, 2006 కి ముందు, అమెరికా ప్రయాణికులలో చికున్‌గున్యా ఇన్ఫెక్షన్లు చాలా అరుదుగా ఉండేవి. 2006-2013 సమయంలో, అమెరికాలో ప్రతి సంవత్సరం సగటున 28 మందికి చికున్‌గున్యా వైరస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారించడం జరిగింది. వీరందరూ ఆసియా, ఆఫ్రికా లేదా హిందూ మహాసముద్రంలోని ప్రభావిత ప్రాంతాలకు వస్తున్న లేదా తిరిగి వస్తున్న ప్రయాణికులు. CDC ప్రకారం, 2019 తర్వాత అమెరికాలో స్థానికంగా సంక్రమించే కేసులు ఏవీ కనిపించలేదు. అయితే, 2024లో ప్రయాణ సమయంలో అమెరికా పౌరులలో 199, 2025లో ఇప్పటివరకు 46 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..