భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె మరణించిన మరుసటి రోజే భర్త కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటన కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం మండల పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కమ్మర్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం వినోద్ అనే వ్యక్తికి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం గురిజాల గ్రామానికి చెందిన సువర్ణ అనే యువతితో 2020లో వివాహం జరిగింది.
అయితే ఈ దంపతులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అంతా హ్యాపీగా ఉందనే క్రమంలో భార్య సువర్ణకు ఆరోగ్యం క్షీణించింది. దీంతో గత కొన్నాళ్లుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది. ఇటీవల ఆమె పరిస్థితి మరింత విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లతారు కుటుంబ సభ్యులు.. అయితే అక్కడే హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ సువర్ణ మృతి చెందింది.
ఇక సువర్ణ మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు.. అయితే అంత్యక్రియలు ముగించుకొని ఇంటికి రాగానే భర్త వినోద్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వినోద్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్టు నిర్ధారించారు.
24 గంటల వ్యవధిలోనే భార్య భర్తలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో
కమ్మర్‌పల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.