భారతదేశంలో గంగ నది, యమున, కావేరి, కృష్ణ, గోదావరి, నర్మదా ఇలా అన్ని నదులకు స్త్రీ పేర్లు ఉన్నాయి. అయితే కానీ ఒక నదిని పురుష నది అని పిలుస్తారు. ఈ నది పేరు బ్రహ్మపుత్ర నది. ఇది భారతదేశంలోనే కాదు ఆసియాలో కూడా పొడవైన నదులలో ఒకటి.
హిమాలయాలలో పుట్టి బంగాళాఖాతంలో కలిసే వరకు ప్రవహించే బ్రహ్మపుత్ర నదికి హిందూ మతంలోనే కాదు జైన మతం, బౌద్ధమతంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ నది దాని విస్తారత, మతపరమైన ప్రాముఖ్యత కారణంగా చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ బ్రహ్మపుత్ర నదితో ముడిపడి ఉన్న ఒక నమ్మకంతో ఈ నది మర్మమైనదిగా నిలిచింది.
హిందూ మత విశ్వాసం ప్రకారం ఈ నది రంగు ప్రతి సంవత్సరం మూడు రోజులు ఎరుపు రంగులోకి మారుతుంది. దీనికి కారణం అస్సాంలోని కామాఖ్య దేవి ఆలయం. అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న శక్తి పీఠం కామాఖ్య దేవి ఆలయం దాని రహస్యాలు, అద్భుతాలకు చాలా ప్రసిద్ధి చెందింది.
కామాఖ్య దేవి ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పురాణ నమ్మకం ప్రకారం సతి దేవి శరీర భాగాలలో యోని ఇక్కడ పడింది. దీని కారణంగా ఇక్కడ ఉన్న అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి రుతుక్రమం అవుతుంది. దీని కారణంగా బ్రహ్మపుత్ర నది మూడు రోజులు ఎర్రగా మారుతుందని చెబుతారు.
ప్రతి సంవత్సరం జూన్ నెలలో వచ్చే ఆషాఢ మాసంలో బ్రహ్మపుత్ర నది నీరు ఎర్రగా మారుతుందని నమ్ముతారు. ఈ సమయంలో కామాఖ్య దేవి రుతుక్రమం అవుతుంది. ఆమె రక్తం ప్రవహించడం వల్ల ఈ నది నీరు ఎర్రగా మారుతుంది. కామాఖ్య దేవి రుతుక్రమ సమయంలో దేవి ఆలయం మూడు రోజుల పాటు మూసివేస్తారు.
ప్రపంచంలోని ఏకైక పురుష నది అయిన బ్రహ్మపుత్ర నదిని హిందువులు బ్రహ్మ-అమోఘల కుమారుడుగా భావిస్తారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లలో ఈ నదిని దేవతగా పూజిస్తారు. అయితే ఈ నది నీరు ఎరుపు రంగులో ఉండటానికి వేర్వేరు కారణాలు చెప్పబడ్డాయి.
బ్రహ్మపుత్ర నది ఎర్రగా మారడానికి శాస్త్రీయ కారణం ఏమిటంటే ఈ నది ప్రవహించే ప్రాంతంలోని నేలలో ఇనుము అధికంగా ఉండటం వల్ల నది నీరు ఎరుపు రంగులో ఉంటుంది. అలాగే ఎరుపు , పసుపు నేల అవక్షేపాలు భారీ పరిమాణంలో ఉండటం వల్ల నది నీరు ఎరుపు రంగులో ఉంటుందని చెబుతున్నారు.