స్కూల్ కి వెళ్లడం పిల్లల జీవితంలో సంతోషంగా ఉండాలి. కానీ ఈ అలవాటు వారి శరీరానికి భారంగా మారి.. అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. పది శాతం వారి శరీర బరువుకు మించి స్కూల్ బ్యాగ్ బరువు ఉండకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంటే 30 కిలోల బరువు ఉన్న పిల్లల బ్యాగ్ 3 కిలోల కంటే ఎక్కువ ఉండకూడదు.
వాస్తవానికి పిల్లలు ఎన్నో పుస్తకాలు, నోట్‌బుక్స్, లంచ్ బాక్స్, నీటి బాటిళ్లు, స్టేషనరీ వస్తువులు ప్యాక్ చేసి 6 నుంచి 8 కిలోల వరకు బ్యాగ్ తీసుకెళ్తున్నారు. కొందరు పిల్లలు టాబ్లెట్లు, ల్యాప్ టాప్ లాంటివి కూడా బ్యాగులో పెట్టుకుంటున్నారు. ఈ భారాన్ని తరచూ మోయడం వల్ల వారి శరీర స్థితి మారిపోతుంది.
వెన్నెముకకు ముప్పు
భారమైన స్కూల్ బ్యాగుల మోత వల్ల పిల్లల్లో వెన్నునొప్పి, మెడ నొప్పి, భుజాల నొప్పి వంటి సమస్యలు గణనీయంగా పెరిగాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లల వెన్నెముక దెబ్బతినే ప్రమాదం (స్పైనల్ మిస్‌లైన్‌మెంట్) కూడా మొదలవుతుంది.
పిల్లల ఎముకలు, కండరాలు ఇంకా పూర్తిగా పెరిగే దశలో ఉంటాయి. వారిపై ఎక్కువ ఒత్తిడి ఉంటే అది వారి ఆరోగ్యానికి హానికరం. రోజూ కఠినమైన బరువులు మోయడం వల్ల వెన్నెముక అకాలంగా దెబ్బతింటుంది. దీని వల్ల పిల్లలు తరచూ వెన్నునొప్పులు, తలనొప్పులు, కండరాల అలసటను ఎదుర్కొంటున్నారు. వారి శ్వాస తీసుకునే సామర్థ్యం కూడా తగ్గే అవకాశం ఉంది.
మెదడు, శరీరం శక్తులు తగ్గిపోవడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం, తరగతుల్లో వారి శ్రద్ధ పడిపోతాయి. ఒకవైపు బ్యాగ్ వేసుకుంటే శరీరంలోని కండరాల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది స్కోలియోసిస్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
జాగ్రత్తలు
- పిల్లలు తమ స్కూల్ బ్యాగ్ ను రెండు స్ట్రాప్ లతో సమంగా ధరించడం అలవాటు చేసుకోవాలి. ఒకవైపు మాత్రమే బ్యాగ్ వేసుకోవడం వల్ల శరీరంపై మరింత ఒత్తిడి పడుతుంది.
- పిల్లలు తమ బ్యాగులో ఉన్న అవసరం లేని వస్తువులను తల్లిదండ్రులు తీసివేసి బరువు తగ్గించాలి.
- పాఠశాలలు కూడా ఈ సమస్య పరిష్కారానికి తోడ్పడాలి. పిల్లలకు లాకర్లు లేదా డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేసి పుస్తకాల బరువును తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి.
- టీచర్లు విద్యార్థుల పాఠ్య ప్రణాళికలను జాగ్రత్తగా ప్లాన్ చేసి ఒక రోజుకు ఎక్కువ పుస్తకాలు తీసుకెళ్లే అవసరం లేకుండా చూడాలి.
పిల్లల వెన్నెముక సంరక్షణ
తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు వైద్యులు బ్రేసులు లేదా ఫిజియోథెరపీ ద్వారా పిల్లల వెన్నెముకను సరిచేయాలని సూచిస్తున్నారు. పిల్లలు వెన్నునొప్పి, కండరాల వాపు వంటి లక్షణాలు చెప్పినప్పుడు. వాటిని సీరియస్ గా తీసుకోవాలి. ఆ సమస్యలు తీవ్రం కాకుండా ముందే గుర్తించి జాగ్రత్త తీసుకోవడం అవసరం.
ఈ చిన్న మార్పులు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. పెద్దలు, స్కూల్ సిస్టమ్, పిల్లలు కలిసి ఈ సమస్యపై శ్రద్ధ పెట్టాలి. పిల్లల ఆరోగ్యం మెరుగుపరచడానికి.. వారి స్కూల్ బ్యాగ్ బరువును నియంత్రించడం చాలా ముఖ్యం.