
ప్రేమ.. రెండక్షరాల ఈ పదం మనిషికి ఎంత సంతోషాన్ని ఇస్తుందో..అంతే బాధను కలిగిస్తుంది. ప్రేమ ప్రాణం పోస్తుందంటారు. కానీ ఆ ప్రేమే ప్రాణాలు కూడా తీస్తుంది. ప్రేమ వల్ల బలైనవారు ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. కొన్ని ప్రేమలు చరిత్రలు మిగిలిపోతే.. మరికొన్ని ప్రేమలు మాత్రం చితిలో కలిసిపోతున్నాయి..లేదా వాళ్లకు వాళ్లే కలిపేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే… పెళ్లి చేసుకోమని ప్రియుడిని కోరడమే ఓ ప్రియురాలు పాలిట శాపమైంది. పెళ్లి చేసుకోవడం దేవుడెరుగు.. అలా అడిగినందుకే ఆమెను చంపేశాడు ప్రియుడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. దాబాలోని ఓ రూమ్‌లో దుప్పటిలో చుట్టిన యువతి మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. యువతిని 22 ఏళ్ల అల్కా బింద్ గా గుర్తించిన పోలీసులు.. ప్రియుడే ఆమెను చంపినట్లు తేల్చారు. అయితే కాలేజీకి వెళ్లిన బిడ్డ శవమై కనిపించడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
రూపాపూర్ ప్రాంతానికి చెందిన అల్కా బింద్.. మీర్జాపూర్‌కు చెందిన సాహబ్ బింద్‌కు కొంతకాలం క్రితం ఓ పెళ్లిలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. యువతి తనను పెళ్లి చేసుకోవాలంటే సాహబ్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది. అంతేకాకుండా డబ్బులు కూడా కావాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోను కాలేజీకి వెళ్లిన యువతి కనిపించకుండా పోయింది. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు తమ కూతురు కన్పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అదే రాత్రి ఆమె హత్యకు గురైంది. అల్కా పెళ్లి, డబ్బు ప్రస్తావనతో విసుగు చెందిన సాహబ్.. ఎలాగైన తన అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే అల్కాను దాబాకు రప్పించి గొంతుకోసం చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఉదయం గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన ఉద్యోగికి అల్కా.. రక్తపు మడుగులో పడి ఉండడం చూసి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సాహబ్ తన సోదరి ఇంట్లో ఉన్నాడని గుర్తించి..అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సాహబ్ తప్పును ఒప్పుకున్నాడు. అల్కా పెళ్లి, డబ్బు కోసం పదే పదే ఒత్తిడి చేయడంతో చంపేసినట్లు విచారణలో తెలిపాడు. ఈ క్రమంలో గన్ లాక్కొని పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సాహబ్ ప్రయత్నించగా.. పోలీసులు అతడి కాలుపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ సమాజ్ వాది పార్టీ చీప్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..