ప్రజా పాలన చేపట్టిన తల్లి కూతుళ్లు.. ఒకరు మేయర్ గా.. మరొకరు గ్రామ సర్పంచ్‌గా..!

ప్రజా పాలన చేపట్టిన తల్లి కూతుళ్లు.. ఒకరు మేయర్ గా.. మరొకరు గ్రామ సర్పంచ్‌గా..!


రాజకీయాల పట్ల ఆసక్తిలేకున్నా.. కొందరు మహిళలు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నారు. ఒకే కుటుంబం నుంచి ఒకరు గ్రామ సర్పంచ్‌గా.. మరొకరు నగర మేయర్‌గా ఎన్నికై పాలనా పగ్గాలు చేపట్టారు. ప్రజా పాలన చేపట్టిన తల్లీకూతుళ్లు.. గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

తెలంగాణ రాష్ట్రంలో మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు.. నిన్న మున్సిపల్ ఎన్నికలు సందడి చేశాయి. ఎన్నికల్లో ఎంతోమంది కొత్తవారు.. ముఖ్యంగా మహిళలు పాలన పగ్గాలు చేపట్టారు. ఒకే కుటుంబం నుంచి ఒకరు.. ఇద్దరు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. కానీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తల్లీకూతుళ్లు.. ఒకరు సర్పంచ్‌గా.. మరొకరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికయ్యారు.

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లికి చెందిన బండ అంజిరెడ్డి – సరోజ దంపతులు. అంజిరెడ్డికి రాజకీయాలపై ఆసక్తి ఎక్కువగా ఉండేది. దీంతో 20 ఏళ్ల క్రితం సర్పంచ్‌గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 20 ఏళ్ల తర్వాత జనంపల్లి సర్పంచి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన సతీమణి సరోజ పోటీ చేసి ఎన్నికయ్యారు. పాలన పగ్గాలు చేపట్టి గ్రామ మొదటి పౌరురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జనంపల్లికి చెందిన అంజిరెడ్డి – సరోజ పెద్ద కూతురు.. చైతన్య రెడ్డి. చైతన్యకు 23 ఏళ్ల క్రితం నల్గొండకు చెందిన బుర్రి శ్రీనివాస్ రెడ్డితో వివాహమైంది. బుర్రి శ్రీనివాస్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి ప్రధాన అనుచరుడుగా కొనసాగుతున్నారు. చైతన్య రెడ్డి గతంలో రామాలయం చైర్మన్ గా, కౌన్సిలర్ గా పనిచేశారు. ఇటీవల జరిగిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా ఎన్నికైంది. రిజర్వేషన్ల సమీకరణలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

అయితే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ పీఠాన్ని బుర్రి చైతన్య రెడ్డి అధిష్టించారు. కౌన్సిలర్ గా ఉన్నప్పుడు.. ఆమె వెనక భర్త శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. చైతన్య రెడ్డి ఇప్పుడు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఒంటిరిగానే రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టారు.

తల్లి గ్రామ సర్పంచ్ గా.. కూతురు నల్గొండ నగర మేయర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు తమ గ్రామానికి చెందిన ఆడపడుచు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నిక కావడం పట్ల జనంపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *