పెళ్లి చేయాలంటూ హంగామా.. సెల్ టవర్‌పై నుంచి పడి18 ఏళ్ల యువకుడు మృతి!

పెళ్లి చేయాలంటూ హంగామా.. సెల్ టవర్‌పై నుంచి పడి18 ఏళ్ల యువకుడు మృతి!


ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నౌజ్ జిల్లాలో బుధవారం (ఫిబ్రవరి 11) తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ 18 ఏళ్ల యువకుడు 100 అడుగుల ఎత్తైన మొబైల్ టవర్‌ ఎక్కాడు. చివరికి టవర్‌పై నుండి పడి మరణించాడు. ఆ యువకుడు ఆ ఎత్తైన కట్టడంపైకి ఎక్కి దాదాపు రెండు గంటలు అక్కడే ఉన్నాడు. టవర్ పై నుంచి ఒక అమ్మాయితో పెళ్లి జరిపించాలని, ఆమె పేరును పదే పదే అరిచాడు. లేదంటే చనిపోతానంటూ అల్టిమేటం జారీ చేశాడు. నన్ను ఆమెకు వివాహం చేయి, లేకుంటే నేను దూకి చనిపోతాను అంటూ హెచ్చరించాడు.

వెంటనే, కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చి, అతన్ని కిందకు దిగమని వేడుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసు బృందాలు కూడా గ్రామానికి చేరుకుని అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించాయి. కానీ అతను అందుకు ససేమిరా అని టవర్ పైనే నిలబడ్డాడు. ముందుగా వివాహం గురించి నిర్ణయం తీసుకోండి, ఆ తర్వాతే కిందకు వస్తానంటూ బీష్మించుకుని కూర్చొన్నాడు. చివరికి టవర్ పైనుంచి కిందపడటంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. యువకుడిని సిహెచ్‌సికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.

మృతుడిని పురభోజ్ గ్రామానికి చెందిన సుమిత్ రాజ్‌పుత్ (18) గా గుర్తించారు. రాజస్థాన్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అతను 15 రోజుల క్రితమే ఇంటికి తిరిగి వచ్చాడు. సుమిత్ బంధువుల అమ్మాయితో వన్‌సైడ్ ప్రేమలో ఉన్నాడు. దీంతో ఆమె కుటుంబం ఆ వివాహ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ అమ్మాయి అతన్ని ప్రేమించలేదు. కేవలం మూడు రోజుల క్రితం వేరొకరిని వివాహం చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు అతన్ని సురక్షితంగా కిందకు దించడానికి ఒప్పించేందుకు ప్రయత్నించారని, కానీ అతను మొండిగా ఉన్నాడని స్థానికులు వెల్లడించారు.

సుమిత్ తండ్రి మూడేళ్ల క్రితం చనిపోయాడు. ఇంట్లో అతని వితంతువు తల్లి, తమ్ముడు అతనిపై ఆధారపడి ఉన్నారు. అతని చెల్లికి ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అతని తమ్ముడు మానసికంగా బలహీనంగా ఉన్నాడు. దీంతో సుమిత్ కుటుంబానికి ఏకైక జీవనాధారం అయ్యాడు. సుమిత్ మృతితో ఆ కుటుంబం ఒంటరిగా మిగిలిపోయింది. కాగా, ఈ ఘటనకు సంంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *