ఉమ్మడి కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వచ్చిరాని వైద్యంతో ఓ RMP డాక్టర్ చేసిన అబార్షన్ వికటించి మహిళ మృతి చెందింది. నంద్యాల జిల్లా పగిడియాల మండలం బీరవోలు గ్రామానికి చెందిన శ్రీవాణికి ఇద్దరు ఆడపిల్లలు. మగ బిడ్డ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోగా ఆమె గర్భం దాల్చింది. ఆరో నెల అయ్యింది. ఆడపిల్ల లేక మగ బిడ్డల అని తెలుసుకునేందుకు కర్నూలులోని రక్ష హాస్పిటల్‌కి లింగ నిర్ధారణ పరీక్షల కోసం వెళ్ళింది. ఇలా చేయడం చట్టరీత్యా నేరం ఒకవేళ చేయాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయి అని రక్ష హాస్పిటల్ చెప్పింది. హాస్పిటల్ చెప్పినట్లుగా డబ్బులు చెల్లించింది. లింగ నిర్ధారణ పరీక్ష చేయించుకుంది. పరీక్షలో ఆమెకు ఆడబిడ్డ పుడుతుందని వైద్యులు తెలిపారు. దీంతో తమకు ఆడబిడ్డ వద్దని.. అబార్షన్ చేయించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తన భర్తకు తెలిపింది.
దీంతో భర్త ఆమెను నందికొట్కూరులోని RMP డాక్టర్ గీత దగ్గరకు తీసుకెళ్లాడు. తన భార్యకు అబార్షన్ చేయాలని తెలిపాడు. దీంతో సదరు డాక్టర్ మహిళకు అబార్షన్ చేసింది. అయితే అబార్షన్ చేసినప్పటి నుంచి మహిళ బ్లీడింగ్‌తో పాటు భరించలేని నొప్పితో బాధపడుతోంది. అలానే మూడు రోజుల పాటు నొప్పిని భరించింది. నాలుగో రోజు హాస్పిటల్ కి తీసుకెళ్లేలోగా మృతి చెందింది. దీంతో జరిగిన సంఘటనపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దారుణ సంఘటనపై స్పందించారు. విచారణలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, వైద్యం రాణి ఆర్.ఎం.పి వైద్యురాలు గీత అబార్షన్ చేయడం వల్లే మహిళ మృతి చెందినట్లు నిర్ధారించారు. హాస్పిటల్, ఆర్ఎంపీ డాక్టర్ పైన పోలీస్ స్టేషన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ఫిర్యాదు చేసింది. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ గీతపై కేసు నమోదయింది. కర్నూలులోనే రక్ష ఆసుపత్రి స్కానింగ్ సెంటర్ కి లాక్ చేశారు. ఎందుకు చట్టపరమైన చర్యలు తీసుకోరాదొ చెప్పాలని నోటీసు అతికించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.