పేరుకు IVF.. కానీ చెప్పేది సరోగసీ. కానీ చేసేది మాత్రం ఇతరుల పిల్లల విక్రయం. సృష్టి కేసులో బయటపడుతున్న దారుణాలు ఎన్నో. ఈ అరాచకాలు చూసిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం కొరడా దెబ్బ ఝలిపించడానికి రెడీ అయింది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న IVF సెంటర్ల భరతం పట్టేందుకు సర్కారు సిద్ధమైంది. ఇదిలావుంటే, గుజరాత్‌లో వెలుగు చూసిన ఏడు నెలల చిన్నారి కిడ్నాప్ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
గుజరాత్‌లోని ధోల్కా ప్రాంతంలో ఏడు నెలల చిన్నారి కిడ్నాప్ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. రోడ్డుపై నిద్రిస్తున్న సమయంలో చిన్నారిని అపహరించినట్టు గుర్తించిన పోలీసులు, రెండు రోజుల్లోనే విచారణను వేగవంతంగా జరిపి కిడ్నాపర్లను అరెస్టు చేశారు. మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు అహ్మదాబాద్ గ్రామీణ పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వస్తున్నకొద్దీ ఇది సాధారణ అపహరణ కాదని, గుజరాత్ నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించిన బాలల అక్రమ రవాణా ముఠా పని అని స్పష్టమవుతోంది. చిన్నారిని అపహరించిన నిందితులు మహారాష్ట్రకు తరలించి ఓ ఏజెంట్‌కు అప్పగించారు. ఆ ఏజెంట్ చిన్నారిని IVF, సరోగసీ చికిత్సలు పొందే కుటుంబాలకు ఇవ్వడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ గ్యాంగ్ వివిధ రాష్టాల్లో విస్తరించి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ముఠాలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు మహారాష్ట్రకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఇందులోని ప్రధాన పాత్రధారి ధోల్కాలోని ఒక IVF సెంటర్లో నర్సుగా పని చేస్తున్న మహిళగా గుర్తించారు. ఆమె తన పరిచయాన్ని ఉపయోగించి తక్కువ తక్కువలో మానవ అక్రమ రవాణా ముఠాకు సహకరించిందని, మరో ముగ్గురితో కలిసి ఈ చిన్నారి అపహరణంలో పాల్గొన్నట్లు తేలింది. అపహరించిన చిన్నారిని వారు ఔరంగాబాద్‌కు తీసుకెళ్లి ఓ నర్సుకు విక్రయించారు. చిన్నారిని కొనుగోలు చేసిన ఆ నర్సును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఔరంగాబాద్‌కి వెళ్లిన ప్రత్యేక పోలీస్ బృందం విచారణలో బయటపడింది. పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను వేర్వేరు రాష్ట్రాల్లోకి పంపి సమాచారం సేకరించగా చిన్నారిని కాపాడారు. ప్రస్తుతం చిన్నారి పూర్తిగా సురక్షితంగా ఉండగా, ఆమెను తిరిగి గుజరాత్‌కి తరలించి కుటుంబానికి అప్పగించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కేసు ఒక్కటే కాకుండా దేశవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న అక్రమ రవాణాకు ఇది ప్రతినిధిగా నిలుస్తోంది. IVF, సరోగసీ, గర్బదానం వంటి చికిత్సల పేరిట పిల్లలను అమ్ముకునే కుట్రలు ఎలా నడుస్తున్నాయో ఈ కేసు ద్వారా స్పష్టమవుతోంది. చిన్నారులను డబ్బుగా చూసే ఈ ముఠాలకు వైద్యరంగం, అనధికారిక గర్భధారణ సెంటర్లు సహకరించే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. చిన్నారుల రక్షణకు ప్రత్యేక చట్టాల అమలు కఠినంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ కేసులో మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. కేసు పూర్తి విచారణ అనంతరం మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
In a swift and excellently coordinated inter State operation, a 7-month-old baby girl, kidnapped from Dholka on 30/7/25 was rescued. Congratulations to SP Ahmedabad Rural and his team for making tireless efforts. Special thanks to DGP Maharashtra and team of Aurangabad police for… pic.twitter.com/BbBk5trDjR
— DGP Gujarat (@dgpgujarat) August 1, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..