తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త.. కొత్త స్కీమ్ రూపకల్పనలో అధికారులు!

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త.. కొత్త స్కీమ్ రూపకల్పనలో అధికారులు!


తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో కొత్త ఆరోగ్య పథకం అందుబాటులోకి రానుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కొత్తగా రూపొందిస్తున్న ఈ స్కీమ్‌ను న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీంగా పిలవనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నగదు రహిత వైద్య సేవల పథకంలో ఎదురవుతున్న సమస్యలను పూర్తిగా తొలగించి, మరింత బలమైన విధానంతో కొత్త పథకాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకంపై తుది నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీంపై చర్చించేందుకు ఫిబ్రవరి 12వ తేదీన రాష్ట్ర సచివాలయంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో, ఇతర ఉన్నతాధికారులతో పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. పథకం అమలు రూపకల్పన, ఉద్యోగుల భాగస్వామ్యం, సేవల పరిధి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా నగదు రహిత వైద్య సేవలు అమలవుతున్నాయి. అయితే ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిలు పెరగడం, చెల్లింపులు ఆలస్యం కావడం వల్ల చాలా చోట్ల హెల్త్ కార్డులు సరైన విధంగా పనిచేయడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో చికిత్స కోసం ముందుగా డబ్బులు ఖర్చు చేసి, తర్వాత రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసినా.. పూర్తిస్థాయిలో తిరిగి చెల్లింపులు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త ట్రస్ట్ విధానంలో స్కీమ్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ‘ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్’ (EHCT) అనే కొత్త ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు. కొత్త పథకంలో ఉద్యోగులు కూడా కొంత మేర కాంట్రిబ్యూషన్ చెల్లించే విధంగా మార్గదర్శకాలు సిద్ధం చేశారు. అందులో భాగంగా ఉద్యోగుల బేసిక్ పే నుంచి 1.5 శాతం కాంట్రిబ్యూషన్ తీసుకునే ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఉదాహరణకు రూ.50 వేల బేసిక్ ఉన్న ఉద్యోగి నెలకు రూ.750 వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విధానం ద్వారా పథకానికి నిధులు స్థిరంగా అందుతాయని, ఆసుపత్రులకు బకాయిలు సకాలంలో చెల్లించడం, కార్డులు నిరంతరం పనిచేయడం వంటి సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మొదట ఈ స్కీజమ్‌ను ఇన్సూరెన్స్ పద్ధతిలో అమలు చేయాలని ప్రభుత్వం ఆలోచించినా.. చివరికి ట్రస్ట్ విధానంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త పథకం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు పర్యవేక్షణలోనే కొనసాగనున్నట్లు సమాచారం. ఈ నెల 12న జరగనున్న సమావేశం తర్వాత కొత్త పథకంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులపై పడే భారం ఎంత? సేవల పరిధి పెరుగుతుందా? హాస్పిటల్స్‌లో కార్డులు నిరంతరం పనిచేస్తాయా? అనే అంశాలపై ఆ రోజు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *