వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ తమ కార్యకలాపాలను వేగవంతం చేశాయి. మరోసారి జెండా పాతాలని డీఎంకే ప్రణాళికలు రచిస్తోంది. దీనికి అనుగుణంగా పథకాల అమలు, అభివృద్ధి పనుల్లో జోరు పెంచింది. తమ పనితీరుకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని.. మరోసారి గెలపు తమదేనని డీఎంకే నేతలు ధీమాగా ఉన్నారు. మరోవైపు ఎలాగైన అధికార డీఎంకేకు చెక్ పెట్టాలని బీజేపీ-ఏఐడీఎంకే ప్లాన్లు వేస్తున్నాయి. అన్నామలైను అధ్యక్షునిగా తప్పించిన కమలం పార్టీ.. ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టింది. ఇక మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో డీఎంకేకు కమల్ మద్ధతు ఇవ్వడంతో.. ఆయనకు అధికార పార్టీ రాజ్యసభ ఆఫర్ చేసింది.
ఈ పార్టీల సంగతి ఇలా ఉంటే.. తమిళ దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నాడు. అవినీతిని అంతం చేసి, ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా విజయ్ పార్టీని స్థాపించారు.
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలే టైమ్ ఉండడంతో విజయ్ స్పీడ్ పెంచారు. వరుసగా పార్టీ సమావేశాలను నిర్వహిస్తూ.. శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. తాజాగా టీవీకే కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. విజయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 300మందికిపైగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో వివిధ తీర్మానాలను ఆమోదించారు. అందులో ప్రధానంగా.. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్ బరిలో ఉంటారనే తీర్మానాన్ని కమిటీ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా ఈ ఏడాది అగస్ట్ నుంచి డిసెంబర్ వరకు విజయ్ రాష్ట్రమంతా పర్యటిస్తారని పార్టీ నేతలు తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా..? లేక ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఈ నిర్ణయాన్ని తీసుకునే అధికారం విజయ్‌కే అప్పగిస్తూ కార్యినిర్వాహక కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది. ఏదిఏమైనా తమిళనాడు సీఎం పోరులో మరో సినీ స్టార్ చేరారు. గతంలో ఎంజీ రామచంద్రన్, జయలలిత, విజయ్‌కాంత్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేశారు. ఇక కమల్ హాసన్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. మరి విజయ్ తన పార్టీతో ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటున్నారన్నది వెయిట్ అండ్ సీ.