విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే దారి తప్పుతున్నారు. తాజాగా ఒక ఉపాధ్యాయుడు తాగిన మత్తులో పిల్లలకు బోధించడానికి స్కూల్‌కు వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ జిల్లా వాద్రాఫ్‌నగర్ బ్లాక్ పరిధిలోని రుప్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయుడు శుక్రవారం(ఆగస్టు 8) తాగిన మత్తులో షార్ట్స్ ధరించి పాఠశాలకు వచ్చాడు. అతను కుర్చీపై కూర్చుని టేబుల్ మీద ఉన్న పుస్తకాలపై తన కాళ్ళు పెట్టాడు. ఇదేంటని అడిగితే, డాక్టర్ ప్రతిరోజూ 100 నుండి 200 గ్రాముల మద్యం తాగమని చెప్పాడని, అప్పుడే నడవగలనన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిన తర్వాత, సదరు టీచర్‌పై చర్యలు తీసుకోవాలని DEO, జిల్లా కలెక్టర్‌కు నివేదిక పంపారు.
వాద్రాఫ్ నగర్ బ్లాక్ లోని రుప్పూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా మన్మోహన్ సింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తరచుగా మద్యం మత్తులో పాఠశాలకు వస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఈక్రమంలోనే శుక్రవారం, ఆయన కాషాయ రంగు కండువా, బోల్ బామ్ అని రాసిన టీ-షర్టు, మోకాలు వరకు ఉండే షర్ట్స్ ధరించి పాఠశాలకు చేరుకున్నారు. టేబుల్ మీద పడి ఉన్న పుస్తకాలను తొక్కారు. దీని తర్వాత, తరగతిలోని పిల్లలకు అస్పష్టమైన మాటలతో బోధించారు. ఉపాధ్యాయుడు తాగిన మత్తులో టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుని బోధిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మద్యం సేవించి పాఠశాలకు రావడం గురించి మన్మోహన్ సింగ్‌ను ప్రశ్నించగా, ప్రమాదంలో తన కాలు విరిగిందని చెప్పాడు. తాను చికిత్స పొందుతున్నానని, ప్రతిరోజూ 100 నుండి 200 గ్రాముల మద్యం మందుగా తాగితే నడవగలనని డాక్టర్ చెప్పాడని, అందుకే తాను తాగుతున్నానని చెప్పాడు. రుప్పూర్ గ్రామస్తులు ఈ ఉపాధ్యాయుడు గతంలో చాలాసార్లు మద్యం తాగి పాఠశాలకు వచ్చాడని చెబుతున్నారు. దీనిపై విద్యా శాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ ఆయనను హెచ్చరించి వదిలివేశారు. గతంలో రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఈ విషయంలో వాద్రాఫ్‌నగర్ బిఇఓ శ్యామ్ కిషోర్ జైస్వాల్ స్పందించారు. ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత, సదరు ఉపాధ్యాయుడికి తుది హెచ్చరిక నోటీసు జారీ చేశామని చెప్పారు. ఇక్కడి నుండి, దర్యాప్తు నివేదికను డిఇఓ, జిల్లా కలెక్టర్‌కు పంపామని, అందులో సస్పెన్షన్‌కు సిఫార్సు చేశామని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..