చాలా మందికి వేడి వేడిగా ఘుమఘుమలాడే కప్పు కాఫీ తాగందే రోజు ప్రారంభంకాదు. ఇక రోజు మొత్తంలో ఆఫీసుల్లో, స్నేహితులతో కలిసినప్పుడు, మీటింగ్స్.. ఇలా సందర్భం ఏదైనా కాఫీ రుచులను ఆస్వాధించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. కొంతమందికి, కాఫీ కేవలం పానీయం కాదు. ఇది ఓ రకమైన జీవనశైలి. కాస్త అలసటగా ఉన్నా.. కప్పు కాఫీతాగారంటే మంత్రమేసినట్లు చిటికెలో శక్తి పుంజుకుంటారు. కానీ ఇలా ప్రతిరోజూ కాఫీ తాగే అలవాటు ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావం చూసుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎలా ప్రభావితం అవుతాయో, డయాబెటిక్ రోగులు కాఫీ తాగవచ్చా లేదా అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
కాఫీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందా?
కాఫీలో కెఫిన్ ఉంటుందనేది సంగతి అందరికీ తెలిసిందే. కొన్ని అధ్యయనాలు (మాయో క్లినిక్, వెబ్ఎమ్డి) కెఫిన్ రక్తంలో చక్కెర స్థాయిలను తాత్కాలికంగా పెంచుతుందని వెల్లడించాయి. ఎందుకంటే కెఫిన్ అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను పెంచుతుంది. ఇది చక్కెరను ప్రాసెస్ చేసే కణాల సామర్థ్యాన్ని తాత్కాలికంగా తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అంటే మీ శరీర కణాలు ఇన్సులిన్ హార్మోన్‌కు తగిన విధంగా స్పందించవు. ఇది కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. కెఫిన్‌తో పాటు కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం వంటి ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు ఇందులో ఉన్నాయి. ఈ మూలకాలు శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. మరికొన్ని అధ్యయనాలు ఇది దీర్ఘకాలికంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని వెల్లడించాయి.
బ్లాక్ కాఫీ vs చక్కెర కాఫీ
మీరు తాగే కాఫీ రకాన్ని బట్టి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాఫీలో చక్కెర, క్రీమ్ లేదా ఫ్లేవర్డ్ సిరప్‌లను జోడించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఖచ్చితంగా పెరుగుతాయి. కానీ చక్కెర, పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగితే.. అందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే నిపుణులు బ్లాక్ కాఫీ మంచి ఎంపిక అని అంటున్నారు. అయితే ప్రతి వ్యక్తి శరీరం కెఫిన్‌కు భిన్నంగా స్పందిస్తుంది. కొంతమందికి, కెఫిన్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మరికొందరికి ఇది అస్సలు ప్రభావితం చేయకపోవచ్చు. కానీ డయాబెటిస్ ఉన్నవారు కాఫీ తీసుకునే సమయం, పరిమాణం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే నిపుణులు కాఫీ తాగేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. డయాబెటిస్ ఉన్నవారు చక్కెర, పాలతో చేసిన కాఫీని తాగకపోవడమే మంచిది. బదులుగా బ్లాక్ కాఫీ తాగవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఏ విధంగానూ ప్రభావితం చేయదు. కానీ గుర్తుంచుకోండి.. డయాబెటిస్ ఉన్నవారు కాఫీని మితంగా తాగాలి. ఎందుకంటే అధిక కెఫిన్ నిద్రను ప్రభావితం చేస్తుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.