
ముఖంపై నల్ల మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు చాలా మందికి ఉండే సాధారణ సమస్య. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి ఇంట్లో దొరికే కాఫీ అద్భుతంగా పనిచేస్తుంది. కాఫీలో ఉండే కెఫైన్, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి తాజాదనాన్ని ఇచ్చి.. నల్లటి మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూవారీ చర్మ సంరక్షణలో కాఫీతో చేసిన కొన్ని ఫేస్ ప్యాక్‌లు చాలా ఉపయోగపడతాయి.
నల్ల మచ్చలకు చెక్
ఒక టీస్పూన్ కాఫీ పొడి, ఒక టీస్పూన్ తేనె, కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ముఖానికి సున్నితంగా మర్దన చేయండి. ఈ మిశ్రమాన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఈ ప్యాక్ ను వారంలో రెండు లేదా మూడు సార్లు వాడితే నల్ల మచ్చలు క్రమంగా తగ్గుతాయి.
మెరిసే ముఖం మీ సొంతం
ఒక టీస్పూన్ కాఫీ పొడిలో రెండు టీస్పూన్ల పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇది నల్ల మచ్చలతో పాటు ఉబ్బిన కళ్ల సమస్యకు కూడా మంచి పరిష్కారం.
కళ్ల కింద నల్ల మచ్చలకు కూడా..
ఒక టీస్పూన్ కాఫీ పొడి, ఒక టీస్పూన్ అలోవెరా జెల్ కలిపి కళ్ల కింద సున్నితంగా రాయండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. ఈ చిట్కాను వారంలో మూడు సార్లు పాటిస్తే కళ్ల కింద ఉండే నల్ల మచ్చలు తగ్గుతాయి.
(NOTE: పై చిట్కాలు ఉపయోగించే ముందు తప్పని సరిగా పాచ్ టెస్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ఎలాంటి అలర్జీ, దురద రాకపోతే మాత్రమే వాడాలి)