ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. చల్లారని క్యాతనపల్లి పొలిటికల్ మంట.. ఎండ్ కార్డ్ పడేదెప్పుడు..?

ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. చల్లారని క్యాతనపల్లి పొలిటికల్ మంట.. ఎండ్ కార్డ్ పడేదెప్పుడు..?


మాట ఇచ్చాం మడమతిప్పం అంటున్నారు లోకల్ కామ్రేడ్‌లు.. కాదు.. కాదు.. కాంగ్రెస్‌తో కలిసుంటేనే కలదు సుఖం అంటోంది కామ్రేడ్ అదిష్టానం. ఇంత జరిగాక వెనక్కి తగ్గితే ప్రజల్లో చులకన అవుతామంటున్నారు లోకల్ ఎర్రన్నలు. అలా కాదు మరోసారి ఆలోచించండి.. భవిష్యత్ అవసరాల కోసం ఒక్క అడుగు వెనక్కి వేస్తే తప్పేమీ లేదంటోంది ఆ పార్టీ అధినాయకత్వం.

టికెట్ల పంపకాల నుండి మొదలు నామినేషన్ల వరకు.. ఎన్నికల నుండి మొదలు ఫలితాలు విడుదల చైర్మన్ పీఠం వరకు.. ఆందోళనలు, దాడులు, అరెస్ట్‌లు, సస్పెన్స్‌ల మీద సస్పెన్స్‌లు.. ట్విస్టుల మీద ట్విస్ట్‌లతో ఎటు తెగడం లేదు క్యాతన్‌పల్లి పురపాలకవర్గ ఎన్నిక పంచాయితీ. ఓ వైపు ఇంకా కొనసాగుతున్న క్యాంపులు.. తాడోపేడో తేల్చుకుంటాం అంటున్న కారు తమ్ముళ్ల ప్రతిజ్ఞలు.. చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ చేస్తున్న విశ్వ ప్రయత్నాలతో క్యాతన్‌పల్లి చైర్మన్ పీఠం ఎన్నిక పీక్స్ కు చేరింది. ఇంతకీ క్యాతన్‌పల్లిలో ఏం జరగబోతోంది.. ఎన్నికల కమిషన్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది. మంత్రి వివేక్.. మంకు పట్టే విజయం సాదిస్తుందా.. ప్రజాస్వామ్యమే గెలుస్తుందంటున్న బీఆర్ఎస్ కూటమి నెగ్గుతుందా..? క్యాతన్‌పల్లి కహానీ కి ఎండ్ కార్డ్ పడేదెప్పుడన్న చర్చ మొదలైంది.

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లి.. కేవలం 22 వార్డులు మాత్రమే ఉన్న ఈ మున్సిపాలిటీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చి… చైర్మన్ ఎన్నిక మొదలయ్యేంత వరకు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ మున్సిపాలిటీ సింగరేణి కార్మిక క్షేత్రం కావడం కామ్రేడ్‌లకు మంచి పట్టు ఉండటంతో సీపిఐతో పొత్తుకు అటు అధికార పార్టీ కాంగ్రెస్, ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పట్టుపట్టింది. మంత్రి వివేక్ తో జరిగిన చర్చలు విఫలమవడం.. సీట్ల సర్దుబాటులో సీపిఐ కలిసిరాకపోవడంతో పోటీ తప్పలేదు. సీపిఐ తో పొత్తు పొడుపులో చివరికి గులాబీ పార్టీనే పై చేయి సాధించింది. అదిగో అక్కడ పడ్డ తొలి అడుగు కాంగ్రెస్ ఓటమిని ఖరారు చేసింది.

ఫిబ్రవరి 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో క్యాతన్‌పల్లిలో ఘోరా పరాజయాన్ని మూటగట్టుకుంది అధికారిక పార్టీ కాంగ్రెస్. దీనికి ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఒక కారణం అయితే ఆయ‌న మాటలను గుడ్డిగా నమ్మి కామ్రేడ్‌లను దూరం చేసుకోవడం మంత్రి వివేక్ చేసిన మరో తప్పు అని తేలింది. అంతే గెలుపు తర్వాత అలర్ట్ అయిన మంత్రి వివేక్ ఎలాగైనా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలని నిర్ణయించుకున్నారు. కానీ ఏం లాభం అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పొత్తులో భాగంగా 22 సీట్లున్న క్యాతన్‌పల్లిలో సీపిఐ తో కలిసి బీఆర్ఎస్ 14 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మాత్రం కేవలం 7 సీట్లకే పరిమితం అయింది. అటు మ్యాజిక్ పిగర్‌ను దాటి కారు దూసుకుపోవడంతో క్యాతన్‌పల్లి చైర్మన్ ఎన్నిక లాంచనమే అయిపోయింది. కానీ అలా జరిగే ఉంటే ఇంత సినిమా అవసరం ఉండేదే కాదు..!

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని తెలిసినా చివరి ప్రయత్నం చేద్దాం అన్న మంత్రి‌ వివేక్ కోటరి నిర్ణయం క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికను రచ్చ రచ్చ చేసింది. ఫిబ్రవరి 16వ తేదీన కౌన్సిల్ ఎన్నిక జరగాల్సి ఉండగా.. మున్సిపల్ కౌన్సిల్ హాల్‌కు బయలుదేరిన సీపిఐ, బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడం హై టెన్షన్‌ను క్రియేట్ చేసింది. ఒక్కసారిగా పరిస్థితులు చేయి దాటి పోవడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.

మొదటి రోజు కోరం లేక పోవడం మరుసటి రోజున రెండవ సారి పాలక వర్గ ఎన్నిక సాగాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడం.. అంతే క్యాతన్‌పల్లి రచ్చ రెండవ రోజు మరింత ఫీక్స్ చేరింది. రెండవ రోజు సైతం బీఆర్ఎస్ శ్రేణులను కాంగ్రెస్ అడ్డుకోవడం.. పోలీసుల ఆంక్షలు.. పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఎంట్రీ.. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే కోవలక్ష్మిని మున్సిపాలిటీ వైపు అనుమతించకపోవడం.. అదే సమయంలో మంత్రి వివేక్ కాన్వాయ్ రావడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించడం.. పోలీసుల లాఠీఛార్జ్ తో పరిస్థితి చేయి దాటిపోయింది. మరో వైపు నుండి రాళ్ల దాడితో మంత్రి కాన్వాయ్ పాక్షికంగా ధ్వంసం అవడం.. ముగ్గురు గాయాలపాలవడం.. కేసులు, అరెస్ట్ లవరకు వెళ్లింది.

దీంతో ఫిబ్రవరి 18వ తేదీన క్యాతన్ పల్లి బంద్ ప్రకటించింది బీఆర్ఎస్. ఆ బంద్ తో మరింత హీటెక్కింది క్యాతన్ పల్లి రాజకీయం.. అదే రోజు బాల్క సుమన్ అరెస్ట్ అసలు కంట్రోల్ చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంత జరిగాకా.. అరెస్ట్ ల పర్వం కొనసాగుతున్న వేళ ఏ మొహం పెట్టుకుని అధికార పార్టీకి మద్దతివ్వాలి అంటోంది లోకల్ కామ్రేడ్ లీడర్స్. ఒక వేళ వెనక్కి తగ్గి స్వలాభం కోసం కాంగ్రెస్ తో కలిస్తే జనం ఛీకొడుతారంటోంది లోకల్ సీపిఐ. సీపిఐ అదిష్టానం మాత్రం.. లేదు లేదు ఇంకా నాన్చొద్దు ఇప్పటికైనా ఈ కథకు ఎండ్ కార్ట్ వేద్దాం అది మన వల్లే సాధ్యం అంటోంది కామ్రేడ్ అదిష్టానం.

మరో వైపు కామ్రేడ్ కౌన్సిలర్లకు భారీ ఆఫర్ ఇచ్చేందుకు మంత్రి వివేక్ సిద్దమయ్యారన్న వాదనలు జిల్లాలో భారీగానే చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇంత జరిగాక.. ఈ రచ్చకు ఇంకా నిప్పు పెట్టేలా.. ఆ సెగతో చేతులు మరింత కాల్చుకునేలానే వ్యవహరం మారడం ప్రమాదకరమే. చూడాలి మరీ ఇంత రచ్చ జరిగాక.. క్యాతన్‌పల్లి దాడి ఘటనలో అరెస్ట్‌ల పర్వం ఆగకుండా కొనసాగుతున్న వేళ.. పోలీసుల పై అపవాదు మరింత పడుతున్న వేళ.. నన్ను జైల్లో పెట్టినా బీఆర్ఎస్ విజయాన్ని ఆపలేమంటూ బాల్క సుమన్ బల్ల గుద్ది చెపుతున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం క్యాతన్ పల్లి పై జంగ్ సైరన్ పూరించిన వేళ.. క్యాతన్ పల్లి రాజకీయ రణరంగపు రచ్చకి ఇరు పార్టీలు ఎలా ఎండ్ కార్డ్ వేస్తారో చూడాలి. బంతి ఇప్పుడు ఎన్నికల కమిషన్ కోర్ట్‌లో ఉంది.. బీఆర్ఎస్ క్యాంపు ఇంకా కొనసాగుతూనే ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *