మన శరీరం కండరాల నిర్మాణానికి, దెబ్బతిన్న కణజాలాలను మరమ్మతు చేయడానికి ప్రోటీన్ అత్యంత ఆవశ్యకమైన పోషకం. అయితే ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం.. భారతీయులలో చాలా మంది తగినంత ప్రోటీన్ తీసుకోవడం లేదని తేలింది. ప్రోటీన్ అనగానే మనకు గుర్తొచ్చేవి చికెన్, గుడ్లు. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్? పోషకాల పరంగా ఏది గెలుస్తుంది? అనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మీకు రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం?
ఒక వ్యక్తికి అవసరమయ్యే ప్రోటీన్ వారి శరీర బరువుపై ఆధారపడి ఉంటుంది. ప్రతి కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల నుండి 1 గ్రాము ప్రోటీన్ అవసరం. మీరు 60 కిలోల బరువు ఉంటే రోజుకు సుమారు 48 నుండి 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.
చికెన్ Vs గుడ్లు: ప్రోటీన్ లెక్కలు
ప్రోటీన్ పరిమాణం విషయానికి వస్తే చికెన్‌ది పైచేయిగా కనిపిస్తుంది. 100 గ్రాముల లీన్ చికెన్‌లో 25 – 27 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అదేవిధంగా ఒక పెద్ద గుడ్డులో 6-7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
అంటే 100 గ్రాముల చికెన్ ఇచ్చే ప్రోటీన్ కావాలంటే మీరు సుమారు 4 గుడ్లు తినాల్సి ఉంటుంది.
పోషకాల పరంగా ఏది మేలు?
కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా ఇతర పోషకాలలో రెండూ ప్రత్యేకమైనవే.. చికెన్‌లో పాస్పరస్, సెలీనియం, విటమిన్ B3 పుష్కలంగా ఉంటాయి. గుడ్లు మల్టీ విటమిన్ ఆహారం వంటివి. వీటిలో విటమిన్ D, B12, ఐరన్, జింక్, రాగి, కంటికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే మెదడు పనితీరుకు అవసరమైన కోలిన్ గుడ్లలో అధికం.
బరువు తగ్గాలనుకునే వారికి ఏది ఉత్తమం?
మీరు బరువు తగ్గడంపై దృష్టి పెడితే.. లీన్ చికెన్ ఉత్తమ ఎంపిక. ఇందులో కొవ్వు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆకలిని త్వరగా వేయకుండా నియంత్రిస్తుంది. అయితే ప్రతిరోజూ అల్పాహారంలో భాగంగా గుడ్లు తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఆరోగ్యవంతులు రోజుకు రెండు గుడ్ల వరకు నిరభ్యంతరంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.
బడ్జెట్ – సౌకర్యం
చికెన్‌తో పోలిస్తే గుడ్లు చౌకగా లభిస్తాయి. వండటం కూడా సులభం. పిల్లలు, గర్భిణీ స్త్రీలకు ఇవి తక్షణ పోషణను అందిస్తాయి. మరోవైపు కండరాల పెరుగుదల కోరుకునే జిమ్ ప్రియులకు చికెన్ అత్యంత శక్తివంతమైన ఆహారం.
మీ లక్ష్యం కేవలం ప్రోటీన్ అయితే చికెన్ ఎంచుకోండి. ప్రోటీన్‌తో పాటు అన్ని రకాల విటమిన్లు అందాలంటే గుడ్లను డైట్లో చేర్చుకోండి. నిజానికి ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పూర్తి అమైనో ఆమ్లాలు మరియు ఖనిజాలు అందుతాయి.