వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లా నవగ్రామ్ ప్రాంతంలో విద్యార్థులతో నిండిపోయిన ఒక స్కూల్ వ్యాన్ పల్టీ కొట్టింది. గుంతలుగా ఉన్న రోడ్డుపై వెళ్తూ ప్రమాదం చోటు చేసుకుంది. పైగా వర్షం కురవడంతో ఆ రోడ్డంతా బురద చేరి అస్తవ్యస్తంగా మారింది. పల్సొండా నుంచి లాల్బాగ్ వెళ్లే స్టేట్ హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రయాణించేందుకు అసలే వీలు లేని ఈ రోడ్డుపై ఎన్నో పెద్ద పెద్ద వాహనాలు ఇబ్బందుల నడుమ వెళ్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే విద్యార్థుల స్కూల్ వ్యాన్ ఆ మార్గంలో ఎంతో ప్రమాదకరంగా ప్రయాణించింది. ఉన్నట్లుండి పెద్ద గుంత రాగానే అక్కడి నుంచి ముందుకు కదలలేక పూర్తిగా ఎడమ వైపుగా వాలిపోయి ఆ వ్యాన్ అదే మురుగు నీటిలో బోల్తా పడింది. వాహనంలో ఉన్న చిన్నారులు బయటపడే మార్గం లేక బిక్కుబిక్కుమంటూ కాసేపటి వరకు లోపలే ఉండిపోయారు.
గమనించిన కొందరు స్థానికులు.. వ్యాన్‌ను మళ్లీ యధాస్థితికి చేర్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందరూ కలిసి లోపల చిన్నారులు అలా ఉండగానే ఆ వాహనాన్ని పైకి లేపారు. తర్వాత ఒక్కొక్కరిగా విద్యార్థులను బయటికి తీసి ఒక పక్కగా ఉంచారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్కూల్ వ్యాన్ బోల్తా పడడంతో నమ్మి తమ పిల్లలను ఎలా పంపేది అని గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పుడు పెద్ద ప్రమాదమే తప్పింది.. కానీ, రేపు ఏదైనా జరగరానిది జరిగితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ‘ఇంకా ఎంతకాలం ఇలాగే చూడాలి? ఇలాంటి రోడ్లపై ప్రయాణించలేకుండా ఉన్నామని వాపోయారు. పైగా తమ పిల్లలను స్కూళ్లకు పంపి ఇంట్లో మనశ్శాంతిగా ఎలా ఉండగలమని స్థానిక అధికారులను నిలదీస్తున్నారు.
రోడ్ల కారణంగా గాయాల పాలవుతుండటమే కాకుండా, గ్రామాల్లోని చిన్న చిన్న వీధులు కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు రోడ్ల పరిస్థితిపై బాహాటంగానే విమర్శిస్తున్నారు. స్కూల్ నుంచి చిన్నారులు ఇంటికి చేరుకునే వరకూ భయంతో ఎదురుచూడాల్సి వస్తుందని, వెంటనే రోడ్లను పునరుద్ధరించి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..