సాఫ్ట్‌వేర్ రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న కోడింగ్ ప్రాధాన్యత ఇకపై తగ్గిపోనుందని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో సాఫ్ట్‌వేర్ తయారీ, వినియోగ పద్ధతులు పూర్తిగా మారిపోతున్నాయని, ఐటీ నిపుణులకు ఇకపై కోడ్ రాయడం ప్రధాన లక్ష్యం కాదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 17న జరిగిన ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్ డే సమావేశంలో ఐటీ పరిశ్రమలో సంభవిస్తున్న ఈ మార్పులను విశ్లేషించారు. గతంలో వచ్చిన మొబైల్ లేదా క్లౌడ్ టెక్నాలజీల వంటి మార్పుల కంటే ఏఐ పరివర్తన భిన్నమైనదని నీలేకని తెలిపారు. ‘‘ఇది కేవలం పాత అప్లికేషన్‌కు కొత్త ఫ్రంట్ ఎండ్ తగిలించడం లాంటిది కాదు. వ్యాపార ప్రక్రియలు, కస్టమర్ ప్రయాణాలు, సంస్థాగత నిర్మాణాలను ప్రాథమికంగా పునరాలోచించాల్సిన సమయం ఇది’’ అని ఆయన అన్నారు.
ఐటీ నిపుణుల ముందున్న సవాలు
భవిష్యత్తులో ఐటీ ఉద్యోగుల పనితీరు కేవలం కోడ్ రాయడానికి పరిమితం కాదని, ఏఐని సమర్థవంతంగా పని చేయించడంపైనే ఉంటుందని ఆయన వివరించారు. పాత సాఫ్ట్‌వేర్ పద్ధతుల్లో అవుట్‌పుట్‌లు ఊహించదగినవిగా ఉండేవి. కానీ ఏఐ ప్రపంచంలో ఒకే ప్రాంప్ట్‌కు వేర్వేరు సమయాల్లో వేర్వేరు ఫలితాలు రావచ్చు. ఏఐ ఇంజనీరింగ్, ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్ వంటి అంశాలపై నిపుణులు పట్టు సాధించాల్సి ఉంటుంది.
సాంకేతిక రుణం వీడాల్సిందే
చాలా పెద్ద సంస్థలు తమ బడ్జెట్‌లో మెజారిటీ వాటాను దశాబ్దాల నాటి పాత వ్యవస్థలను నిర్వహించడానికే ఖర్చు చేస్తున్నాయని, దీనివల్ల ఏఐని అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నాయని నీలేకని అభిప్రాయపడ్డారు. ఏఐ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందాలంటే ఆధునీకరణను ఇకపై వాయిదా వేయలేమని ఆయన హెచ్చరించారు.
అమలులోనే అసలైన చిక్కు
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న వేగంతో పోలిస్తే, సంస్థలు దానిని అమలు చేస్తున్న వేగం తక్కువగా ఉందని ఆయన విశ్లేషించారు. ‘‘సాంకేతికత చాలా ముందుంది. కానీ దానిని గ్రౌండ్ లెవల్‌లో అమలు చేయడం కష్టంగా మారింది. ఇది కేవలం టెక్నాలజీ మార్పు మాత్రమే కాదు.. డేటాను క్రమబద్ధీకరించడం, సిబ్బందికి తిరిగి శిక్షణ ఇవ్వడం, సంస్థాగత మార్పుతో కూడుకున్న పని’’ అని ఆయన తెలిపారు.
గ్లోబల్ మార్కెట్‌లో ఐటీ స్టాక్‌ల అమ్మకాలు జోరుగా సాగుతున్న తరుణంలో ఇన్ఫోసిస్‌తో పాటు కాగ్నిజెంట్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వంటి దిగ్గజాలు కూడా ఏఐ ఆధారిత వ్యాపార నమూనాల వైపు మళ్లుతున్నట్లు ప్రకటించాయి. కేవలం సాఫ్ట్‌వేర్ కంపెనీలుగానే కాకుండా ఏఐ ఆధారిత ఉత్పాదకత లాభాలను అందించే ప్లాట్‌ఫారమ్‌లుగా ఇవి రూపాంతరం చెందుతున్నాయి.