కృష్ణ జన్మభూమి కేసులో భవిష్యత్తులో జరిగే అన్ని విచారణలలో షాహి ఈద్గా మసీదును “వివాదాస్పద నిర్మాణం”గా పేర్కొనాలని హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. షాహి ఈద్గా మసీదును వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించాలన్న అభ్యర్థనను చేసిన దరఖాస్తు A-44 తిరస్కరించింది. జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ దరఖాస్తును ఇప్పటికైతే కొట్టివేస్తున్నట్లు మౌఖికంగా పేర్కొంది.
దావా నంబర్ 13లో పిటిషనర్ న్యాయవాది మహేంద్ర ప్రతాప్ సింగ్.. షాహి మసీదును వివాదాస్పద నిర్మాణంగా ప్రకటించాలని ఒక ప్రార్థనను సమర్పించారు. దరఖాస్తు A-44 ద్వారా అసలు కేసులో భవిష్యత్తులో జరిగే అన్ని విచారణల సమయంలో షాహి ఈద్గా మసీదు అనే పదానికి బదులుగా వివాదాస్పద నిర్మాణం అనే పదాన్ని ఉపయోగించమని కోర్టు స్టెనోగ్రాఫర్‌కు సూచించాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. అయితే ముస్లిం పక్షం ఈ దరఖాస్తుపై లిఖితపూర్వక అభ్యంతరం దాఖలు చేసింది. కోర్టు దరఖాస్తును తోసిపుచ్చడం ముస్లిం పక్షానికి పెద్ద ఉపశమనం కలిగించింది. ఇదిలా ఉండగా హిందూ పక్షం దాఖలు చేసిన 18 పిటిషన్లపై ఇంకా విచారణలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసును జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ విచారిస్తోంది.
కృష్ణ జన్మభూమి కేసు దేనికి సంబంధించినది?
మధురలో షాహి ఈద్గా మసీదు ఉంది. ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటిది. శ్రీకృష్ణుని జన్మస్థలంలో ఉందని భావిస్తున్న ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత ఈ మసీదు నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. 1968లో ఆలయాన్ని నిర్వహించే శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్, ట్రస్ట్ షాహి మసీదు ఈద్గా మధ్య “రాజీ ఒప్పందం” కుదిరింది. ఈ ఒప్పందంలో ఆలయం, మసీదు రెండూ పక్కపక్కనే ఉండటానికి ఇరు వర్గాలు అంగీకరించాయి. అయితే ఇటీవలి సంవత్సరాలలో ఈ ఒప్పందం చట్టబద్ధతను సవాలు చేస్తూ కోర్టులో అనేక కొత్త వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. రాజీ మోసపూరితమైనదని, చట్టబద్ధంగా చెల్లదని పిటిషనర్లు పేర్కొన్నారు. వారిలో చాలామంది ఆ స్థలంలో పూజలు చేసుకునే హక్కును కోరుతున్నారు, మసీదును తొలగించాలని కూడా కోరుతున్నారు.
మే 2023లో మధుర కోర్టులో పెండింగ్‌లో ఉన్న ఈ వివాదానికి సంబంధించిన అన్ని కేసులను అలహాబాద్ హైకోర్టు తనకే బదిలీ చేసుకుంది. ఈ బదిలీ ఉత్తర్వులను మసీదు కమిటీ, తరువాత ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. డిసెంబర్ 2023లో షాహి ఈద్గా మసీదును తనిఖీ చేయడానికి కోర్టు కమిషనర్‌ను నియమించాలనే అభ్యర్థనను హైకోర్టు మన్నించింది. అయితే జనవరి 2024లో, సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వుపై స్టే విధించింది. తరువాత స్టేను పొడిగించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి