మీరు మీ గ్రామంలోని ఒక కిరాణా షాపులో కూర్చుని ఉన్నారు. మీ ఫోన్ సడెన్‌గా రింగ్ అయ్యింది. అది లిఫ్ట్ చేయగానే.. హలో, ఇది విరాట్ కోహ్లీ అనే వాయిస్ వినిపించింది. కొద్దిసేపటి తర్వాత మరొక కాల్ వచ్చింది.. ఈ సారి ఏబీ డివిలియర్స్, ఆపై మరొక కాల్.. ఇది రజత్ పాటిదార్.. ఇదంతా వింటుంటే ఓ సినిమా సీన్‌లా అనిపిస్తుందా..? కానీ ఇది నిజంగా జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా దేవ్‌భోగ్‌లో ఈ ఘటన జరిగింది. జూన్ 28న కిరాణ కొట్టు నడిపే మనీష్ స్థానిక మొబైల్ దుకాణం నుండి కొత్త రిలయన్స్ జియో సిమ్ తీసుకున్నాడు. సిమ్ యాక్టివేట్ అయ్యాక వాట్సాప్ క్రియేట్ చేయగానే రజత్ పాటిదార్ ప్రొఫైల్ పిక్చర్ కనిపించింది. దీంతో అది టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చిందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కాల్స్ రావడం ప్రారంభించాయి. ఆ కాల్స్ ఫ్రెండ్స్, చుట్టాల నుంచి కాదు.. క్రికెట్ దిగ్గజాల నుంచి. విరాట్ కోహ్లీ అని, ఏబీ డివిలియర్స్ నుంచి కాల్స్ వచ్చాయి.
నేను ఎంఎస్ ధోనీ..
మనీష్ అతడి ఫ్రెండ్ ఖేమ్‌రాజ్ ఆ కాల్స్‌ను జోక్‌గా తీసుకున్నారు. ఎవరో ప్రాంక్ చేస్తున్నారని భ్రమపడ్డారు. వారికి కాల్ వచ్చినప్పుడల్లా.. తమను తాము “మహేంద్ర సింగ్ ధోనీ” అని పరిచయం చేసుకున్నారు. జూలై 15న మనీష్‌కు తెలియని నంబర్ నుండి మరో కాల్ వచ్చింది. ఈసారి..భాయ్, నేను రజత్ పాటిదార్. ఈ నంబర్ నాది, దయచేసి దాన్ని తిరిగి ఇచ్చేయండి అనేది కాల్ సారాంశం. మళ్లీ వారు జోక్ అనుకుని తాము మేము ఎంఎస్ ధోనీలం అని బదులిచ్చారు. రజత్ పాటిదార్ చాలా ఓపికగా ఈ నంబర్ చాలా ముఖ్యమైనదని.. దానికి తన కోచ్, స్నేహితులు, క్రికెట్ లెజెండ్‌లు కనెక్ట్ అయి ఉన్నట్లు చెప్పారు. అయినా మనీష్ నమ్మలేదు. దీంతో నేను నేను పోలీసులను పంపుతాను అంటూ పాటిదార్ హెచ్చరించాడు.
నా జీవిత లక్ష్యం నెరవేరింది
కొంత సమయం తర్వాత పోలీసులు మనీష్ ఇంటికి చేరుకున్నారు. అప్పుడే వారికి అర్థమైంది నిజమైన రజత్ పాటిదార్‌తో మాట్లాడుతున్నామని. వెంటనే ఇద్దరూ సిమ్‌ను తిరిగి ఇచ్చారు. జరిగిన విషయం తెలుసుకుని విరాట్ కోహ్లీ అభిమానులు అయిన మనీష్, ఖేమ్‌రాజ్‌కు ఎగిరి గంతేశారు. అనుకోకుండా వచ్చిన ఈ కాల్స్ అతని జీవితంలో అత్యంత గుర్తుండిపోయే క్షణాలు అని సంబరపడ్డారు. తప్పు నంబర్ వల్ల కోహ్లీతో మాట్లాడే అవకాశం లభించిందని.. జీవిత లక్ష్యం నెరవేరింది అంటూ మరిసిపోయారు.
మళ్లీ కాల్..?
కాగా రజత్ పాటిదార్ తమకు మళ్లీ కాల్ చేస్తారని మనీష్, ఖేమ్ రాజ్ ఆశిస్తున్నారు. ఈ సారి థాంక్స్ చెప్పడానికి ఫోన్ చేస్తారని నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ తప్పు టెలికాం కంపెనీ వల్ల జరిగింది. కంపెనీలు 90 రోజులకు పైగా ఇన్‌యాక్టివ్‌గా ఉన్న నంబర్‌లను రీసైకిల్ చేసి.. కొత్తవారికి కేటాయిస్తుంది. మూడు నెలలుగా ఇన్‌యాక్టివ్‌లో ఉండడంతో రజత్ పాటిదార్ పాత నంబర్‌ను డీయాక్టివేట్ చేసి మనీష్‌కు ఇచ్చారు. దీంతో అనుకోకుండా ఒక చిన్న కిరాణా దుకాణాన్ని క్రికెట్ హాట్‌లైన్‌గా మార్చారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి