రాజులు పోయినా.. రాజ్యాలు పోయినా.. వారు నిర్మించిన భవనాలు ఆనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయి. అలాంటి చారిత్రక భవనాలను పాలనా కార్యాలయాలుగా, సంగ్రహాలయాలుగా లేదంటే ఖరీదైన హెరిటేజ్ హోటళ్లుగా నేటి తరం ప్రజలు వినియోగిస్తుంటారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. భారతదేశ పాలనకు గుండెకాయలా నిలిచిన కొన్ని భవనాలు వాటి స్థితి మార్చుకుంటున్నాయి. ఈ మధ్యనే భారత ప్రభుత్వం కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని నిర్మించి, వందేళ్ల క్రితం నాటి రాతి కట్టడం నుంచి కార్యకలాపాలను కొత్త భవనానికి మార్చేసింది. ఇదే క్రమంలో త్వరలో మరికొన్ని కీలక పాలన కార్యాలయాలు సైతం రాతి కట్టడాలను వీడి కాంక్రీట్ భవనాల్లోకి మారనున్నాయి. వాటిలో ప్రధాని కార్యాలయం కూడా ఉంది.
ఇప్పుడు నార్త్ & సౌత్ బ్లాక్ భవనాల వంతు
శతాబ్ద కాలం క్రితం భారత్‌ను పరిపాలించిన బ్రిటీష్ పాలకులు తమ రాజధానిని కోల్‌కత్తా నుంచి ఢిల్లీకి మార్చుతూ న్యూఢిల్లీలో అనేక భవనాలను నిర్మించారు. నాటి బ్రిటీష్ వైస్రాయ్ నివాసంతో పాటు ముఖ్య అధికారులు, వివిధ విభాగాల అధిపతులకు కార్యాలయాలుగా ప్రస్తుత రాష్ట్రపతి భవన్, దానికి ఎదురుగా ఉన్న నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాలను ఉపయోగించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వైస్రాయ్ హౌజ్ కాస్తా భారత రాష్ట్రపతి నివాసం, కార్యాలయంగా మార్చి “రాష్ట్రపతి భవన్” పేరుతో వ్యవహరిస్తున్నాం. దానికి ఎదురుగా సౌత్ బ్లాక్‌లో ప్రధాని కార్యాలయం (PMO), ఆ పక్కనే విదేశీ వ్యవహారాల శాఖ, రక్షణ శాఖ మంత్రుల కార్యాలయాలు కొలువుదీరి ఉన్నాయి. వాటికి ఎదురుగా నార్త్ బ్లాక్‌లో ఆర్థిక శాఖ, హోంశాఖ మంత్రుల కార్యాలయాలు ఉన్నాయి. వీటి నిర్మాణం రాయితో చేయడం ఒకెత్తయితే.. ఇండో-సరాసీనిక్ (భారతీయ, ఐరోపా నిర్మాణశైలుల మిశ్రమం)లో చూపరులను కట్టిపడేసేలా ఈ భవంతులు ఉంటాయి. ఇప్పటికీ అనేక మంది పర్యాటకులు రాష్ట్రపతి భవన్‌తో పాటు నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ ముందు నిల్చుని ఫొటోలు దిగుతుంటారు.
ఎదురుబొదురుగా ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉన్న ఈ భవనాల్లో దేశ పరిపాలనలో కీలకమైన మంత్రిత్వశాఖలు కొలువుదీరగా.. మిగతా మంత్రిత్వ శాఖలను రైసీనా హిల్స్ కింద నిర్మించిన శాస్త్రి భవన్, కృషి భవన్, ఉద్యోగ్ భవన్, నిర్మాణ్ భవన్ వంటి ఇతర భవనాల్లో ఏర్పాటు చేశారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. వీటిలో చాలా భవనాలు ఇప్పుడు చరిత్ర గతిలో కలిసిపోనున్నాయి. రూ. 25 వేల కోట్ల ఖర్చుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టి “సెంట్రల్ విస్టా” ప్రాజెక్టులో భాగంగా అనేక పాత భవనాలను తొలగించి కొత్త భవనాలను నిర్మాణం జరుగుతోంది. వాటిలో కొన్ని భవనాల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
కర్తవ్య భవన్‌కు రైసీనా హిల్స్ కార్యాలయాలు
రైసీనా హిల్స్‌పై కొలువైన నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లలో ఉండే ప్రధాని కార్యాలయం సహా రక్షణశాఖ, విదేశాంగ శాఖ, ఆర్థిక శాఖ, హోంశాఖ మంత్రిత్వ శాఖలు త్వరలో అక్కణ్ణుంచి ఖాళీ కానున్నాయి. వాటిని కొత్తగా నిర్మించిన కర్తవ్య భవన్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చారిత్రక నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాలను ఇక నుంచి సంగ్రహాలయాలు (మ్యూజియాలు)గా మార్చనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇందులో భారత ఉపఖండానికి సంబంధించిన 5,000 సంవత్సరాల ఘన చరిత్రను చాటే చారిత్రక సంపదను ప్రదర్శనకు ఉంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నార్త్ బ్లాక్‌లో శిల్ప సంపద, ఇతర చారిత్రక సంపదను ఏర్పాటు చేసి, సౌత్ బ్లాక్ లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొదించిన త్రీడీ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్టు వివరించింది.
మరో రెండేళ్లలో ఈ తరలింపు ప్రక్రియ పూర్తిచేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న భవనానికి కర్తవ్య భవన్ 3 గా నామకరణం చేశారు. మరో 9 భవనాలను కూడా శరవేగంగా నిర్మిస్తున్నారు. ప్రతి భవనానికి కర్తవ్య భవన్ పేరు పెట్టి చివర్లో అంకెను జోడించనున్నారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న కర్తవ్య పథ్‌కు చెరో వైపున ఈ భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తిచేసుకున్న వాటిలో ఒక భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 6న (బుధవారం) మధ్యాహ్నం గం. 12.15కు ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు కర్తవ్యపథ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు.
కర్తవ్య భవన్ 3 విశేషాలు:
ఇది దాదాపు 1.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అత్యాధునిక కార్యాలయ సముదాయం. ఇందులో రెండు బేస్‌మెంట్‌లు, ఏడు అంతస్తులు (గ్రౌండ్ ఫ్లోర్ + 6 అంతస్తులు) కలిగి ఉంటుంది. ఇందులో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, MSME మంత్రిత్వ శాఖ, సిబ్బంది మరియు శిక్షణ శాఖ, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ/విభాగం మరియు ప్రధాన శాస్త్రీయ సలహాదారు (PSA) కార్యాలయాలు ఉంటాయి.
కర్తవ్య భవన్-3 ఢిల్లీ అంతటా విస్తరించి ఉన్న వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఏకం చేస్తుంది. ప్రస్తుతం చాలా మంత్రిత్వ శాఖలు శాస్త్రి భవన్, నిర్మాణ్ భవన్, ఉద్యోగ్ భవన్ నుండి పనిచేస్తున్నాయి. కర్తవ్య భవన్-3 సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సెంట్రల్ సెక్రటరియట్ భవనాల్లో మొదటిది.
కర్తవ్య భవన్-3లో 30% తక్కువ విద్యుత్తును వినియోగించేలా ఏర్పాటు చేశారు. భవనం చల్లగా ఉంచడానికి, బాహ్య శబ్దాన్ని తగ్గించడానికి ప్రత్యేక గాజు కిటికీలను ఏర్పాటు చేశారు. ఇంధన ఆదా చేసే LED లైట్లు, అవసరం లేనప్పుడు లైట్లను ఆపివేయడానికి సెన్సార్లు, విద్యుత్ ఆదా చేయడానికి స్మార్ట్ లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. కర్తవ్య భవన్-3 పైకప్పుపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాలు ప్రతి సంవత్సరం 5.34 లక్షల యూనిట్లకు పైగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. కర్తవ్య భవన్‌లో 24 ప్రధాన సమావేశ గదులు, 26 చిన్న సమావేశ గదులు, 67 సమావేశ గదులు, 27 లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు.