మలక్కపారలోని వీరన్‌కుడిలో బేబీ, రాధిక దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఓ చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున సుమారు 2:45 గంటల ప్రాంతంలో కుటుంబం గాఢ నిద్రలో ఉండగా, ఓ చిరుతపులి గుడిసెలోకి చొరబడింది. నిద్రిస్తున్న వారిలో నాలుగేళ్ల చిన్నారి రాహుల్‌ను నోట కరుచుకుని బయటకు లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో బాలుడు భయంతో గట్టిగా కేకలు వేయడంతో తల్లిదండ్రులు ఉలిక్కిపడి లేచారు. కళ్లెదుట చిరుతపులి తమ కొడుకును లాక్కెళ్తుండటం చూసి వారు నిర్ఘాంతపోయారు. వెంటనే తేరుకున్న తండ్రి బేబీ, ఏమాత్రం భయపడకుండా ప్రాణాలకు తెగించి చిరుతను ఎదుర్కొన్నాడు. గట్టిగా అరుస్తూ రాయితో దానిపై దాడి చేశాడు. దెబ్బకు బెదిరిపోయిన చిరుతపులి బాలుడిని అక్కడే వదిలేసి అడవిలోకి పారిపోయింది. ఈ దాడిలో రాహుల్ తలకు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని టాటా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చాలకుడి తాలూకా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం బాలుడి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఆ దంపతుల రెండేళ్ల కూతురు కూడా వారి పక్కనే నిద్రపోతుండగా, చిరుతపులి గుడిసెలోకి ప్రవేశించి రాహుల్‌ను లాక్కెళ్లింది. బాలుడిపై దాడి చేసిన తర్వాత చిరుతపులి మళ్ళీ గుడిసె దగ్గరకు చేరుకుందని అటవీ అధికారులు పేర్కొన్నారు. త్రిస్సూర్ కలెక్టర్ అర్జున్ పాండియన్, బేబీ కుటుంబాన్ని సందర్శించి వారికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వ సహాయాన్ని ప్రటించారు.
మరిన్ని వీడియోల కోసం: