ఓరి దుర్మార్గుల్లారా.. గుడికెళ్లి మీరు చేసే పని ఇదా? తెల్లబోయిన పోలీసులు..

ఓరి దుర్మార్గుల్లారా.. గుడికెళ్లి మీరు చేసే పని ఇదా? తెల్లబోయిన పోలీసులు..


హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో వరుసగా జరుగుతున్న చోరీల కేసును రాచకొండ కమిషనరేట్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. దాదాపు ఫిబ్రవరి నుంచి నిన్న మొన్నటి వరకు ఆలయాల్లో జరుగుతున్న చోరీలు పోలీసులను కలవరపాటుకు గురి చేశాయి. ఎంతగా దర్యాప్తు చేస్తున్నా.. దొంగలు పట్టుబడలేదు. కానీ సాంకేతిక ఆధారాలు, ఇతర అంశాలను ఆధారం చేసుకుని చివరకు కేసును ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు దొంగలను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.5,36,300 విలువైన పంచలోహ విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

అయితే వరుసగా దేవాలయాల్లో చోరీలు పాల్పడుతున్న నిందితులను ఆంధ్రాకు చెందిన పాత నేరస్తులని పోలీసులు తేల్చారు. ఈ దొంగలు ఇద్దరిని కే. శివానంద, షేక్ హమ్ షరీఫ్‌గా గుర్తించారు రాచకొండ పోలీసులు. నిందితులు కర్నూల్, ప్రకాశం జిల్లాలకు చెందిన వలస కార్మికులని చెబుతున్నారు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఆలయాలపై చోరీలకు పాల్పడ్డట్లు తెలిపారు. శివానందపై గతంలో కాజీపేట్, మీర్‌పేట్, నాగోల్ పోలీస్ స్టేషన్లలో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. ఫిబ్రవరి 27 నుంచి జూన్ 30 మధ్య కాలంలో యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని ఆరు ఆలయాల్లో చోరీలు చేశారని విచారణలో తేలింది. దొంగతనం చేసిన తర్వాత విగ్రహాలను ఉప్పల్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి శివకుమార్‌కు అమ్మేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు ఆలయాల నుంచి దొంగిలించిన పంచలోహ విగ్రహాలను చెన్నై, ముంబైలోని స్మగ్లర్లకు అమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. అటు నుంచి విదేశాలకు కూడా ఈ పంచలోహ విగ్రహాలు వెళ్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *