పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌తో పాకిస్థాన్‌ను చావుదెబ్బ కొట్టాము. సుమారు 100 మందికి పైగా ఉగ్రమూకల భరతం పట్టాం. ఇండియా దెబ్బకు పాక్ బిత్తరపోయి.. ఏం చేయాలో తెలియక యుద్ధం ఆపాలంటూ భారత్‌ను వేడుకుంది. దీంతో భారత్ దాడులను నిలిపేసింది. కుక్క తోక వంకరే అన్నట్లుగా ఆ తర్వాత పాక్ మళ్లీ ప్రగల్భాలు పలకడం మొదలుపెట్టింది. ఇటీవలే పాక్ ఆర్మీ చీఫ్ భారత్‌పై నోరు పారేసుకున్నారు. మరోసారి దాడి చేస్తే ఇండియా అంతు చూస్తామంటూ పిచ్చి కూతలు కూశాడు. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్‌పై డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ , లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ సింగ్ స్పందించారు. ఈ సందర్భంగా పాక్, చైనా దేశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాక్- చైనా దోస్తీ భారత్‌కు ప్రమాదకరంగా మారిందని రాహుల్ సింగ్ అన్నారు. సరిహద్దుకు సంబంధించిన వివాదల్లో పాక్ ముందుంటే.. చైనా దానికి వెనక నుంచి మద్ధతు ఇస్తున్నట్లు ఆరోపించారు. పాక్ వద్ద ఉన్న ఆయుధాల్లో 81శాతం చైనాకు సంబంధించినవేనని అన్నారు. మన ఆయుధాల సమాచారాన్ని చైనా పాక్‌కు ఎప్పటికప్పుడు చేరవేసిందని.. టర్కీ సైతం పాక్‌కు అన్ని విధాల అండగా నిలిచిందని విమర్శించారు. డ్రోన్లను అందజేసి.. మనపై దాడులకు సపోర్టుగా ఉందని మండిపడ్డారు. ఒక సరిహద్దు వివాదంపై ముగ్గురు ప్రత్యర్ధులతో మనం పోరాడాల్సి ఉంటుందని.. ఇటువంటి తరుణంలో భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని రాహుల్ సింగ్ అభిప్రాయపడ్డారు.
అంతేకాకుండా మిలటరీ ఆపరేషన్స్ సమయంలో ఎయిర్ డిఫెన్స్‌తో పాటు టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తాయని రాహుల్ సింగ్ అన్నారు. ఆపరేషన్ సింధూర్ టైమ్‌లో చాలా కచ్చితత్వంతో ఉగ్రవాదులపై దాడులు చేశామని వివరించారు. ఈ ఆపరేషన్ కోసం మొత్త 21 టార్గెట్లను గుర్తించి.. చివరి రోజు 9 టార్గెట్స్ ను ఫైనల్ చేశామని తెలిపారు. త్రివిధ దళాలు సమిష్ఠిగా పనిచేయడం వల్లే యుద్ధంలో విజయం సాధ్యమైందన్నారు. అంతేకాకుండా యుద్ధం ప్రారంభించడం కంటే… దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమని రాహుల్ సింగ్ నొక్కి చెప్పారు. ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌కు తగిన గుణపాఠం చెప్పామని.. మళ్లీ మనపై దాడి చేయాలంటే వెనకడుగు వేసే పరిస్థితులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి