
కరీంనగర్ జిల్లాలో పండుగ పూట విషాదం నెలకొంది.. ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుని.. కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ యువతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. తిమ్మాపూర్‌లోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృత్యువాత పడింది. చొప్పదండి మండలం రుక్మాపూర్ కు చెందిన ముద్దసాని అఖిల.. ఉస్మానియా యూనివర్సిటిలో పీజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళ్లింది.. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల వాగేశ్వరీ ఇంజనీరింగ్ కళాశాలలోని అయాన్ డిజిటల్ జోన్ లో పీజీ ప్రవేశ పరీక్ష రాసిన అనంతరం భర్తతో కలిసి.. తిరిగి వస్తుండగా హైదరాబాద్ – రామగుండం రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురైంది. గుర్తు తెలియని వాహనం అఖిల దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.. దీంతో దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. అఖిల రోడ్డుపై మధ్యలో పడిపోవడంతో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమె తలపై నుండి వెళ్లింది.. దీంతో అక్కడిక్కడే మృతి చెందింది.
కాగా అఖిలకు మూడు రోజుల క్రితమే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లొత్తునూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహం అయింది. పెళ్లి తర్వాత కుటుంబంతో ఎంతో ఆనందంగా ఉండాల్సిన సమయంలో అఖిల మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. అఖిల కాళ్లకు పెట్టిన పారాణి కూడా పూర్తిగా ఆరక ముందే ముందే, కానరాని లోకాలకు వెళ్ళింది.
కాగా.. ఈ ఘటనకు ముందు ఇంటి వద్ద కూతురు రాక కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. నల్ల పూసలు కుట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలోనే విషాద వార్త. రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయిందని తెలియడంతో కుటుంబసభ్యులు కుప్ప కూలిపోయారు. ఎంతో సంతోషంగా ఇంటి నుంచి వెళ్లిన కూతురు విగత జీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు తట్టుకోవడం లేకపోతున్నారు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..