జామ పండ్లు చవకగా లభించే పోషకాల గని.. అందుకే దీన్ని పేదవాడి ఆపిల్ అని కూడా పిలుస్తారు. దీనిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అయితే, జామ పండ్లతో పాటు దాని ఆకులు (Guava Leaves) కూడా అనేక ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల్లోని ఔషధ గుణాలను ఆధునిక పరిశోధనలు కూడా ధృవీకరిస్తున్నాయి. కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలకు జామ ఆకులతో ఇంట్లోనే చికిత్సలను తయారు చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. జామ ఆకులు యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, యాంటీమైక్రోబయల్ గుణాలను కలిగి ఉన్నాయి.. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, బరువు తగ్గడం, నోటి ఆరోగ్యం, గుండె ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని పేర్కొంటున్నారు.
ముఖ్యంగా.. జామ ఆకులు ప్రధానంగా షుగర్ (డయాబెటిస్), కీళ్లనొప్పులు, నోటిపూత వంటి సాధారణ సమస్యలకు సమర్థవంతంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జామాకుల ప్రయోజనాలు..
డయాబెటిస్‌లో, జామ ఆకుల కషాయం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారే వేగాన్ని తగ్గిస్తుంది.
కీళ్లనొప్పులు, ముఖ్యంగా వాపులతో కూడిన వాటికి, జామ ఆకుల ముద్దను గోరువెచ్చగా చేసి పట్టులా వేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
అంతేకాకుండా, జామ ఆకుల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల పంటినొప్పి, చిగుళ్ల వాపు, నోటిపూత వంటి నోటి సంబంధిత సమస్యలకు ఇవి అద్భుతంగా పనిచేస్తాయి.
ఆకుల కషాయంతో పుక్కిలించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. కడుపునొప్పి, వాంతులకు కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న ఈ ఆకుల కషాయం ఉపయోగిస్తారు.
ఈ విధంగా, జామ ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. అవసరాన్ని బట్టి వీటిని సరైన పద్ధతిలో ఔషధం కింద వాడుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు..
జామ ఆకులను టీ రూపంలో లేదా లేత ఆకులను నమలడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.. అంతేకాకుండా.. వీటి రసాన్ని కూడా తీసుకోవచ్చు.. అయితే.. ఉదయాన్నే తీసుకుంటే మంచిది..
ఈ వార్తా కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..