విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలోని బండారు వీధిలో నివాసముంటున్న కరగాని పద్మ దారుణ హత్యకు గురైంది. బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా ఇంట్లో నుంచి తీవ్ర గాయాలతో పెద్దపెద్ద కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. అలా పరిగెత్తుతూ ఇంటి వెలుపల ఉన్న గుమ్మం వద్దకు వచ్చి అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. తీవ్ర రక్తస్రావంతో, ఒంటి నిండా గాయాలతో పద్మ శరీరమంతా భయానకంగా ఉంది. పద్మ పరిస్థితి గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే ఆమెను బొబ్బిలిలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పద్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బొబ్బిలిలో జరిగిన ఘటన స్థానికుల్లో భయాందోళనలకు గురి చేసింది.
పద్మ పట్టణంలోని పలు ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తుంటుంది. ఆమె భర్త పైడిరాజు మేకలు కాస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పద్మ యొక్క ఇద్దరు పిల్లలకు వివాహం కావడంతో వారిద్దరు ఆటోలు నడుపుకుంటూ వేరే వేరే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. పద్మకి చిల్లంగి పెట్టడం తెలుసని, గిట్టని వారికి చిల్లంగి పెడుతుందని స్థానికంగా పద్మ పై కొంత పుకార్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల పద్మ భర్త పైడిరాజు అతని సోదరుడు ఆస్తి పంపకాలు చేసుకున్నారు. అయితే ఆస్తి పంపకాల్లో తమకన్నా తన చిన్నాన్న పైడిరాజుకు వాటా ఎక్కువ వచ్చిందని వారి పై అక్కసు పెంచుకున్నాడు పైడిరాజు అన్న కొడుకు కిరణ్. అంతేకాకుండా ఇటీవల కిరణ్ కి గత కొన్ని రోజులుగా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు.
దీంతో తన ఆరోగ్యానికి తన చిన్నమ్మ పద్మ చిల్లంగి పెట్టి ఉంటుందని, కేవలం పద్మకి మాత్రమే చిల్లంగి పెట్టడం తెలుసు అని పద్మ పై కిరణ్ కి అనుమానం కలిగింది. ఈ క్రమంలోనే బుధవారం మధ్యాహ్నం నిందితుడు కిరణ్ కి తన ఇంటి ముందు నిమ్మకాయలు కనిపించాయి. దీంతో తన చిన్నమ్మ పద్మే తనకు చిల్లంగి పెట్టిందని, అందుకే తనకు ఆరోగ్యం బాగోలేదని, అంతేకాకుండా వాటాల్లో తనకు రావాల్సిన తమ ఆస్తి కూడా కాజేశారని కక్ష పెంచుకున్నాడు. దీంతో వెంటనే పట్టరాని కోపంతో ఇంట్లో ఉన్న పద్మ ఇంట్లోకి చొరబడి నాకే చిల్లంగి పెడతావా అని ప్రక్కనే ఉన్న కత్తిపీటతో పద్మ పై దాడికి దిగాడు. ఆ దాడిలో పద్మ తీవ్రంగా గాయాల పాలవ్వడంతో నిందితుడు కిరణ్ పరారయ్యాడు. స్థానికులు పద్మ ను బ్రతికించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.