ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సి. రామ్ ప్రసాద్, దర్శకుడు కృష్ణవంశీతో కలిసి పనిచేసిన అద్భుతమైన అనుభవాలను, ముఖ్యంగా మహేష్ బాబు నటించిన మురారి చిత్రం చిత్రీకరణలోని సవాళ్లను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మురారి కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, మహేష్ బాబు, కృష్ణ ఫ్యాన్స్‌కు ఒక బలమైన భావోద్వేగమని రామ్ ప్రసాద్ చెప్పారు. ఈ చిత్రం మహేష్ బాబు, కృష్ణ గారు, అలాగే రామ్ ప్రసాద్ జీవితాలను ఎంతో ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. కృష్ణవంశీని ప్యాషనేట్ డైరెక్టర్ అని.. ఆయనకున్నది కేవలం ప్యాషన్ కాదని, సినిమా పట్ల పిచ్చి అని అన్నారు. కృష్ణవంశీ ఒక డెవిల్ డైరెక్టర్ అని, షూటింగ్ సమయంలో ఆయన అంకితభావం అసాధారణంగా ఉండేదని వివరించారు. నక్షత్రం సినిమా చిత్రీకరణ సమయంలో, ఒక షాట్ కోసం హీరో సర్టిఫికెట్లు గాలిలోకి ఎగరాలి. అసిస్టెంట్లు ఆరుసార్లు ప్రయత్నించినా కృష్ణవంశీకి నచ్చక, స్వయంగా మట్టిలో కూర్చుని పేపర్లు విసిరారని గుర్తుచేసుకున్నారు. భోజనం వంటి వ్యక్తిగత విషయాలపై కూడా కృష్ణవంశీకి శ్రద్ధ ఉండేది కాదని, సినిమా, ప్యాషనే ముఖ్యం అనే వారని రామ్ ప్రసాద్ తెలిపారు.
సి. రామ్ ప్రసాద్ తన పనితీరులో శుభ్రమైన, పాలిష్డ్ లైటింగ్‌ను ఇష్టపడేవారని, కెమెరాను ఎవరూ తాకకూడదని భావించేవారని తెలిపారు. అయితే కృష్ణవంశీ మాత్రం మాస్ పద్ధతిని అనుసరించేవారని, కెమెరాపై దుమ్ము పడినా, అది విరిగిపోయినా షాట్ పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకునేవారని వివరించారు. ఇలాంటి విభిన్న శైలులు కలిగిన ఇద్దరు వ్యక్తులు కలిసి మురారి వంటి చిత్రాన్ని ఎలా రూపొందించారో ఊహించమని అన్నారు.
మురారి చిత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేక అంశం గురించి రామ్ ప్రసాద్ ప్రస్తావించారు. సంగీత దర్శకుడు మణిశర్మ, సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే అన్ని పాటలను రికార్డ్ చేసి అందించారు. భారతదేశంలో ఇలా జరగడం బహుశా అదే ఏకైక చిత్రం కావచ్చని ఆయన అన్నారు. ఆధునిక కాలంలో షూటింగ్ ముగిసినా, రిలీజ్‌కు పది రోజుల ముందు కూడా పాటలు సిద్ధంగా ఉండవని ఆయన అరుదైన విషయాన్ని వివరించారు. మురారి చిత్రీకరణ సవాళ్లతో నిండినదని రామ్ ప్రసాద్ చెప్పారు. మొదటి రోజు టెంపుల్ షాట్‌తో షూటింగ్ మొదలైందని, ఆ షాట్ ఎక్స్పోజర్ సమస్యలతో కూడుకున్నదని, రాత్రిపూట పాత దేవాలయాలపైకి ఎక్కి లైట్లు అమర్చడం కష్టంగా ఉండేదని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఆటోమేటిక్ కెమెరాలు, జిమ్ములు వంటి ఆధునిక పరికరాలు లేవని, 100 అడుగుల ఎత్తు నుండి కూడా కెమెరాలను మానవీయంగా ఆపరేట్ చేయాల్సి వచ్చేదని తెలిపారు. కెమెరా ఆపరేటర్లు స్వయంగా క్రేన్లపై కూర్చుని భారీ కెమెరాలను నియంత్రించాల్సి ఉండేదని, ప్రాణాపాయకర పరిస్థితులు కూడా ఉండేవని ఆయన వివరించారు. అలనాటి రామచంద్రుడు పాట షూటింగ్ సమయంలోనే తొలిసారి మానిటర్ ఉపయోగించామని, అంతకుముందు మానిటర్లు లేకపోవడం వల్ల కెమెరామెన్ నైపుణ్యంపైనే ఆధారపడాల్సి వచ్చేదని పేర్కొన్నారు.
రామ్ ప్రసాద్ తన కెరీర్లో అత్యంత సవాలుతో కూడిన షాట్ గురించి కూడా వెల్లడించారు. ఒక కొబ్బరిచెట్టుపై నుంచి కెమెరాను ఆపరేట్ చేస్తూ, మహేష్ బాబు మీద కొబ్బరికాయలు పడుతున్నట్లు చిత్రీకరించాల్సి వచ్చింది. భారీ కెమెరాను ఒక చేత్తో పట్టుకుని, మరో చేత్తో కొబ్బరి గెలను పట్టుకుని, కెమెరా స్విచ్ ఆన్ చేసి, మహేష్ బాబు వెళ్లే సమయంలో కాయలను వదలాల్సి వచ్చిందని, ఈ క్రమంలో తన చేతికి గాయమై రక్తం కారిందని వివరించారు. ఆ సమయంలో ఆ షాట్ ఒక్కటే టేక్‌లో ఓకే అయిందని, అది దేవుడి దయ అని అన్నారు. కృష్ణవంశీని పని రాక్షసుడుగా అభివర్ణించిన రామ్ ప్రసాద్, తన కెరీర్లో గురువు వద్ద నేర్చుకున్నదొకటైతే, మురారి సినిమా తనకొక బుక్ వంటిదని అన్నారు. దర్శకుడు కృష్ణవంశీ నుండి తాను సినిమాటోగ్రఫీని తిరిగి నేర్చుకున్నానని, ఇప్పటికీ తాను చేసే పనిలో ఆయన ప్రభావం ఉందని కృతజ్ఞతలు తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‌లో సంచలనంగా మారింది..