కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. మంత్రి పదవి రాకపోవడంపై ఆయనలో నెలకొన్న ఆవేదనను వ్యక్తపరిచారు. పదవి కోసం ఎవరినీ అడగను అని చెప్పిన రాజగోపాల్ రెడ్డి.. తాను ఎవరికాళ్లు మొక్కి పదవి తీసుకోదలచుకోలేదని, తనకు పదవులు అవసరం లేదని తెగేసి చెప్పేశారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే నాకిప్పటికే మంత్రి పదవి వచ్చేది.. కానీ మునుగోడు ప్రజల కోసం నేను ఆ అవకాశాన్ని వదిలేశాను అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు కేంద్రంగా మారాయి. తన సీటును కాకుండా ప్రజల ఆకాంక్షను ఎంచుకున్నానని చెప్పిన ఆయన.. మంత్రి పదవి ఇస్తారా? ఇవ్వరా? అది వారి ఇష్టం. కానీ నేనెప్పుడూ అడగను అంటూ పార్టీ తీరుపై అసంతృప్తిని వెల్లగక్కారు.
ఇక ఇటీవల ఎక్స్ వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యల్లో సీఎం రేవంత్ రెడ్డి మీద పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. పదేళ్లు తానే సీఎం అని ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధానాలకు విరుద్ధమన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులపై సీఎం చేసిన విమర్శల్ని ఖండిస్తూ.. సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేస్తున్న జర్నలిస్టులను గౌరవించాలని చెప్పారు. పాలకుల దృష్టికోణం మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఇక పార్టీకి తన వంతు కృషి చేసినప్పటికీ, తనకు పదవి రాకుండా అడ్డుపడుతున్నారని అనుమానం వ్యక్తం చేసిన రాజగోపాల్ రెడ్డి.. వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్లకూ, తనకంటూ జూనియర్లకూ పదవులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. నేను మాత్రం ఆ పదవుల కోసం ఎవరికాళ్లూ మొక్కను. నా మనస్సు దిగజార్చి బతకడం నాకెప్పటికీ నచ్చదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం రేవంత్‌కు బలంగా మద్దతు నిలుస్తున్నా.. రాజగోపాల్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇటీవల జరిగిన ముఖ్యమైన కార్యక్రమాల్లో, ముఖ్యంగా ఖర్గే పర్యటన, రేవంత్ జిల్లా టూర్లలో ఆయన గైర్హాజరు కావడం వల్ల పార్టీ పట్ల ఆయన అసంతృప్తి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లోని అంతర్గత విబేదాలను స్పష్టం చేస్తున్నారు. పదవులకంటే ప్రజలే ముఖ్యం అంటూ చెప్పిన రాజగోపాల్ రెడ్డి, తనకు పదవి వస్తే మునుగోడు ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని, కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల వల్ల అది కుదరలేదన్న విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి